Monday, December 23, 2024

తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల

- Advertisement -
- Advertisement -

Release of photos of the 22 closed rooms in the Taj Mahal

లక్నో : తాజ్ మహల్ లోని భూగర్భంలో మూతపడి ఉన్న 22 గదులకు సంబంధించిన కొన్ని ఫోటోలను భారత పురావస్తు శాఖ విడుదల చేసింది. ఆ గదుల మరమ్మతుల ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. తాజ్‌మహల్‌లో మూతపడ్డ గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మే 12 న తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇది అప్పటినుంచి చర్చనీయాంశమవుతోంది. బిజెపి అయోధ్య విభాగానికి చెందిన మీడియా ఇన్ ఛార్జి రజనీష్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాజ్‌మహల్ తేజో మహాలయ అనే శివాలయంగా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజ్ వాస్తవ చరిత్రను తెలుసుకోడానికి నిజనిర్ధారణ కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు ఉత్తర్వుల తరువాత ఈ గదుల్లో ఎలాంటి రహస్యం లేదని పురావస్తుశాఖ వెల్లడించింది. ఇవన్నీ నిర్మాణంలో భాగమేనని, తాజ్‌మహల్‌కు భిన్నమైనవి కావని, అదే కాలంలో ఢిల్లీ లోని హుమయూన్ సమాధితోపాటు మొగలుల సమాధులు అనేకం నిర్మాణమయ్యాయని పేర్కొంది.

నది పక్కనున్న ఈ భూగర్భ గదుల నిర్వహణ పనులు చేపట్టడమైందని, పాడైన సున్నం పూతలు బాగు చేయడమైందని వివరించింది. పురావస్తుశాఖ ఈ పునరుద్ధరణ పనులు చేపట్టక ముందు, తరువాత ఫోటోలను గురించి వివరించింది. గోడలు, మెట్లు పాడైన సున్నపు కట్టడాల మరమ్మతులు చేపట్టినట్టు వివరించింది. ఈ మరమ్మతులకు సంబంధించిన ఫోటోలతోపాటు స్మారక కట్టడం పునరుద్ధరణ పనులు అనే క్యాప్షన్ జోడించి ట్విటర్‌లో పోస్టు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి ముందే న్యూస్‌లెటర్ జనవరి 2022 పేరుతో పురావస్తుశాఖ తాజ్‌మహల్ మరమ్మతులు చేపట్టినట్టు పేర్కొనడం గమనార్హం. మే 9 న తాజ్‌మహల్‌లో అండర్‌గ్రౌండ్ వర్క్ అనే పేరుతో మూతపడ్డ 22 గదుల చిత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయగా, ఇప్పుడు తాజాగా మళ్లీ విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News