Wednesday, January 22, 2025

నళిని సహా రాజీవ్ హత్య దోషుల విడుదల

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నళిని, ఆమె భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్‌లు శనివారం సాయంత్రం తమిళనాడులోని వివిధ జైళ్లనుంచి అధికారికంగా విడుదలయ్యారు. మరో వ్యక్తి ఆర్పీ రవిచంద్రన్ కూడా త్వరలో విడుదల కానున్నారు. ఇప్పటికే పెరోల్‌పై ఉన్న నళిని తన తప్పనిసరి హాజరు కోసం శనివారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడినుంచి వెల్లూరులోని మహిళాప్రత్యేక జైలుకు చేరుకున్నారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అక్కడినుంచి విడుదలయ్యారు.

తదనంతరం సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇక్కడినుంచి విడుదలైన ఆమె భర్త శ్రీహరన్,సంథన్‌ను కలుసుకున్నారు. తన భర్తను చూసినప్పుడు నళిని ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీహరన్, సంథన్ ఇద్దరూ శ్రీలంక జాతీయులు కావడంతో పోలీసు వాహనంలో వారిని తిరుచిరాపల్లిలోని శరణార్థుల శిబిరానికి తరలించారు. మరోవైపు పుళల్ జైలునుంచి రాబర్ట్ పయాస్. జయకుమార్‌లు విడుదలయ్యారు. వీరు కూడా శ్రీలంక జాతీయులే కావడంతో వీరిని కూడా తిరుచిరాపల్లి శరణార్థి శిబిరానికే తరలించారు. ఇదే కేసులో దోషిగా తేలి, ఇప్పటికే విడుదలయిన పేరారివేలన్, ఆయన తల్లి..అంతకు ముందు జైలుబయట వీరిని కలిశారు.

తమిళులకు కృతజ్ఞతలు: నళిని

ఇది తనకు కొత్త జీవితమని నళిని పేర్కొన్నారు. జైలునుంచి విడుదలయ్యాక తొలిసారి విలేఖరులతో ఆమె మాట్లాడుతూ ‘ నా భర్త, కుమార్తెతో నాకిది కొత్త జీవితం. అయితే నేను ప్రజా జీవితంలోకి వెళ్లడం లేదు. 30 ఏళ్లకు పైగా మద్దతిచ్చిన తమిళులతో పాటుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ధన్యవాదాలు. నా కుమార్తెతో మాట్లాడాను’ అని చెప్పారు. చెన్నైలో ఉంటారా లేక లండన్‌లో ఉన్న కుమార్తె వద్దకు వెళ్తారా అనే విషయమై నళిని త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆమె తరఫు లాయర్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఆమె భర్త భవిష్యత్తుపై రాష్ట్రప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News