ఫిబ్రవరి 11 వరకు ఆలస్యం రుసుం
లేకుండా ఫీజు చెల్లింపుకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. శనివారం నుంచి ఫిబ్రవరి 11 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో మార్చి 9 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుంతో మార్చి 16 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు అర్హత కలిగిన విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని, అర్హులైన విద్యార్థులు గడువులోగా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే 1 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే -2 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.జెఇఇ మెయిన్ చివరి విడత పరీక్షకు మూడు రోజుల ముందే ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసేలా షెడ్యూల్ రూపొందించారు. ఇందుకోసం ఈసారి ప్రత్యేకంగా ఆదివారం, రెండవ శనివారం సైతం పరీక్ష నిర్వహింంచాలని నిర్ణయించారు. ఏప్రిల్ 7 నుంచి -20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనుండగా,ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.