హైదరాబాద్: రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అధికారులతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు. ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు. 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.
మిగిలిన రైతులకు కూడా త్వరితగతిన నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశించారు. సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు. ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరో మారు సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతుల సంక్షేమం , వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని , గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర రైతాంగం , ప్రజలు రైతుబంధు నిధుల విడుదలపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.