ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ జంతుప్రదర్శన శాల(జూ) గుజరాత్ లోని జామ్ నగర్ లో రూపుదిద్దుకుంది. ఎన్నో రంగాలకు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఈ జూలాజికల్ పార్క్ ను నిర్మించింది. దీనికి “వన్ తార”గా నామకరణం చేశారు. ప్రస్తుతం తన పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న అనంత్ అంబానీ కలల ప్రాజెక్టు ఇది. జంతువులను రక్షించడం, వాటిని సంరక్షించడం ధ్యేయంగా రూపొందిన ఈ అతి పెద్ద ప్రైవేటు జంతు ప్రదర్శనశాలలో భారీ ఆస్పత్రులు, మందుల దుకాణాలు, సిబ్బంది ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం వన్ తారలో 43 జాతులకు చెందిన రెండువేల జంతువులు ఉన్నాయి. వీటి సంరక్షణకు 2100 మంది సిబ్బంది కూడా ఉన్నారు.
ఏనుగులకోసం భారీ ఆస్పత్రి
గుజరాత్ లోని జామ్ నగర్ రిలయన్స్ రిఫైనరీకి దగ్గరలోని మోతీ ఖ్వాడి గ్రామం వద్ద 3,000 ఎకరాల విస్తృత ప్రదేశంలో జూ ఏర్పాటవుతోంది. ఇప్పటికే ఈ జూలో 200కు పైగా ఏనుగులు ఉన్నాయి. వీటి సంరక్షణకు 500మంది సిబ్బంది కూడా ఉన్నారు. వీరిలో వెటరినరీ డాక్టర్లతోపాటు బయాలజిస్టులు, పేథలజిస్టులు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు. సుమారు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగులకోసమే ఒక ప్రత్యేక ఆస్పత్రిని సైతం నిర్మించారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్పత్రులలో ఒకటి. దీనికి అనుబంధంగా ఔషధశాలను, భారీ ఎక్స్ రే మెషీన్లను, సిటి స్కానింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. అనారోగ్యం బారిన పడిన ఏనుగులను ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా భారీ క్రేన్లు, వాటికి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఒక హైడ్రాలిక్ సర్జికల్ టేబుల్, ఆక్సిజన్ చాంబర్ వంటివి ఏర్పాటు చేశారు.
కంటి చూపు ఆనని జంతువులకు ఇక్కడ కేటరాక్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన జంతువులకు ఎండోస్కోపీ సహాయంతో ఆపరేషన్లు చేస్తున్నారు. మెక్సికో, ఆఫ్రికా, స్లోవేకియా వంటి దేశాల్లో నిరాదరణకు గురైన జంతువులను ఇక్కడకు తీసుకువచ్చి వైద్యచికిత్స అందజేస్తున్నారు.
200 చిరుతలకు వైద్య చికిత్స
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు లోనైన, వేటగాళ్ల చేతిలో గాయపడిన 200కు పైగా చిరుతపులులను రక్షించి ఇక్కడకు చేర్చారు. వీటికి వైద్యం చేసి, ప్రాణం పోశారు. ఈ కేంద్రంలో వన్యప్రాణుల సంతానోత్పత్తిని పెంచే సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.
దీనిని ప్రపంచంలోనే అత్యాధునిక వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుకు బాధ్యత వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ.. అంతరించి పోతున్న జంతువులను రక్షించేందుకు ఏర్పడిన సంస్థగా దీనిని అభివర్ణించారు. ఆస్వస్థతకు గురైన జంతువులను రక్షించి, పోషించి.. కోలుకున్న తర్వాత వాటిని స్వస్థలానికి చేర్చే సంస్థగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.