ముంబయి: సంపన్న భారతీయుడు ముకేష్ అంబానీ సారధ్యంలోని దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో ఫ్యూచర్ గ్రూప్‌తో కుదిరిన రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఫ్యూచర్ గ్రూపునకు చెందిన సెక్యూర్డ్ క్రెడిటర్లు ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, ఈ కారణంగానే ఒప్పందాన్ని విరమించుకుంటున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్), ఇతర లిస్టెడ్ కంపెనీలతో కూడిన ఫ్యూచర్ గ్రూప్.. ఓటింగ్ ఫలితాన్ని తమకు తెలియజేసిందని, మీటింగ్‌లో పాల్గొన్న షేర్‌హోల్డర్లు, క్రెడిటర్లు ఒప్పందానికి విరుద్ధంగా ఓటు వేశారని వివరించింది. ఎఫ్‌ఆర్‌ఎల్ క్రెడిటర్లు రిలయన్స్- ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు విరుద్ధంగా ఓటు వేశారని, ఒప్పందంలో పేర్కొన్న అంశాలు ఆచరణ సాధ్యంకాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేర్కొంది.
కాగా ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్, రవాణా(లాజిస్టిక్స్), గిడ్డంగుల నిర్వహణ వ్యాపారాలను రిల్ అనుబంధ విభాగాలైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌విఎల్), రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌ఎఫ్‌ఎల్‌ఎల్)కు విక్రయించేందుకు 2020 ఆగస్టు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాలకు చెందిన మొత్తం 19 ఫ్యూచర్ గ్రూపు కంపెనీలను రిలయన్స్ ఒప్పందం కుదర్చుకున్నామని నాటి ప్రకటన పేర్కొంది. కాగా, రిల్ గ్రూపునకు చెందిన అన్ని రిటైల్ కంపెనీల హోల్డింగ్ కంపెనీయే ఆర్‌ఆర్‌విఎల్.
Reliance Goodbye to Relation with Future group