29న రిలయన్స్ ఎజిఎంలో ప్రకటన
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ వార్షిక సర్వసభ్య సమావేశం(ఎజిఎం) 2022 ఈ నెలాఖరున జరుగనుంది. ఈ నెల 29న వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎజిఎం గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో 5జి సేవల గురించి కూడా కంపెనీ ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎజిఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 5జి సేవల గురించి, అలాగే ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కూడా ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. తొలి దశలో జియో దేశంలోని 13 పట్టణాల్లో 5జి సేవలను ప్రవేశపెట్టనుంది. వాటిలో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, అహ్మదాబాద్, గూర్గావ్, ముంబై, పుణె, హైదరాబాద్, చెన్నై, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో సేవలను ప్రారంభించవచ్చు. దీంతో 5జి ఫోన్‌ను కూడా ముకేశ్ అంబానీ ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది.
అక్టోబర్ రెండో వారంలో 5జి సేవలు
దేశంలో 5జి మొబైల్ సేవలను అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభించనున్నారు. అక్టోబర్ 12 నాటికి దేశంలో 5జి మొబైల్ సేవలను ప్రారంభించనున్నామని, దేశంలోని అన్ని పెద్ద, చిన్న నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని కేంద్ర టెలికాంమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 5జి సేవలు అందుబాటు ధరలో ఉండేలా చూస్తామని టెలికాం మంత్రి అన్నారు.