Wednesday, January 22, 2025

జియోమార్ట్‌లో 1000 మంది ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్‌లైన్ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌విఎల్) ఇటీవల ఫుడ్ హోల్‌సేలర్ మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేసింది. దీని తర్వాత కంపెనీ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. మీడియా నివేదికల ప్రకారం, జియోమార్ట్ రాబోయే కొద్ది వారాల్లో మరో 9,900 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్ సేల్ విభాగం నుంచి దాదాపు మూడింట రెండు వంతుల ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది.

పనితీరు ఆధారంగా లేఆఫ్
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, 500 మంది ఎగ్జిక్యూటివ్‌లతో సహా 1,000 మంది ఉద్యోగులకు రాజీనామాలు ఇవ్వాలని జియోమార్ట్ తన కార్పొరేట్ కార్యాలయాన్ని కోరింది. దీంతో పాటు పనితీరు మెరుగుదల ప్రణాళిక (పిఐపి)లో భాగంగా 100 మందికి పైగా ఉద్యోగులపై కంపెనీ దృష్టిపెట్టింది. ఇతర సేల్స్ ఉద్యోగుల ఫిక్స్‌డ్ పే జీతం తగ్గించడంతో పాటు వారు వేరియబుల్ పే స్ట్రక్చర్‌పై ఉంచారు.

జియోమార్ట్ ఉద్యోగులను ఎందుకు తొలగిస్తోంది?
మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేసిన తర్వాత ఈ సంస్థలోకి 3,500 మంది శాశ్వత ఉద్యోగులను కంపెనీ నియమించుకుంది. ఈ కారణంగా ఉద్యోగుల పాత్రల్లో మార్పులు చేర్పులు పెరిగాయి. మరోవైపు గ్రోసరీ బి2బి రంగంలో ధరల యుద్ధాన్ని ప్రారంభించిన జియోమార్ట్ ఇప్పుడు లాభాలను మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమైంది. కంపెనీ నష్టాలను తగ్గించుకునేందుకు వ్యయ నియంత్రణపై దృష్టిపెట్టింది.

2 నెలల క్రితం మెట్రో కొనుగోలు
రెండు నెలల క్రితం ఆర్‌ఆర్‌విఎల్ ద్వారా ఫుడ్ హోల్‌సేలర్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాను కొనుగోలు చేయడానికి సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఆమోదం కూడా తెలిపింది. ఆర్‌ఆర్‌విఎల్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా 2022 డిసెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు కంపెనీల మధ్య రూ.2,850 కోట్ల ఒప్పందం జరిగింది. మెట్రో ఒక జర్మన్ కంపెనీ, ఇది 2003లో భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించి, క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని ప్రవేశపెట్టింది.

ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల మూసివేత
జియోమార్ట్ దాని సమీపంలోని దుకాణాలకు కిరాణా, సాధారణ వస్తువులను సరఫరా చేసే 150 కి పైగా ఫుల్‌ఫుల్‌మెంట్ సెంటర్‌లలో సగానికి పైగా మూసివేయాలని యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News