మోడీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు విచారణపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపి సంజయ్ సింగ్‌పై గుజరాత్ కోర్టులో దాఖలైన పరువు నష్టం కేసు విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పరవునష్టం కేసుకు సంబంధించి తమకు జారీ అయిన సమన్లను కొట్టివేయాలని కోరూతూ ఆప్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కూడా గుజరాత్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందేప్ మెహతాకు కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. పరువు నష్టం కేసుకు సంబంధించి దిగువ కోర్టులో విచారణ గుజరాత్ హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తమపై దాఖలైన కేసును గుజరాత్ నుంచి కోల్‌కతాకు బదిలీ చేయాలని కోరుతూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వినతిని తిరస్కరించింది.
గుజరాత్ హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ సంజయ్ సింగ్‌ను దోషిగా ప్రకటించి పార్లమెంట్ సభ్యత్వం నుంచి అనర్హుడిగా ప్రకటించే ఉద్దేశంతోనే దిగువ కోర్టులో కేసు విచారణ సాగుతోందని సింగ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదించారు. ఈ కేసులో ఫిర్యాదుదారైన గుజరాత్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా సంజయ్ సింగ్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని, కాని గుజరాత్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నందున ఈ కేసు విచారణను గుజరాత్ నుంచి కోల్‌కతాకు మార్చాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు.