Sunday, January 12, 2025

అదే మా నాన్న చేసిన తప్పు

- Advertisement -
- Advertisement -

సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీ లపై హైకోర్టు స్టే ఇచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాచకొండ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. అలాగే, పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిం ంది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. సోమవారం సాయంత్రం జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో పోలీసుల నోటీసులు అందుకున్న మంచు మనోజ్ బుధవారం విచారణకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు.

సిసిటివి ఫుటేజి మాయం
మేనేజర్ కిరణ్ అరెస్ట్
మోహన్ బాబు కుటుంబ వివాదానికి సంబంధించి సిసిటివి ఫుటేజి కీలకంగా మారినట్టు తెలుస్తోంది. అయితే, మోహన్ బాబు నివాసంలో సిసిటివి ఫుటేజి మాయం కావడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘర్షణలో కీలకంగా ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్‌ను అరెస్ట్ చేశారు. విజయ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి వెంకట్ కిరణ్ సిసిటివి ఫుటేజి మాయం చేసినట్టు గుర్తించారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు: మంచు మనోజ్
మోహన్‌బాబు ఇంటి ఎదుట జర్నలిస్టులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన మంచు మనోజ్ జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపి మీడియాపై దాడిని ఖండించారు. కన్నీళ్లు పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని అన్నారు. మీడియా మిత్రులకు అండగా ఉంటానని, తన నాన్న తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇలా ఉండగా బుధవారం మనోజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆయనను విచారించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సుమారు గంటన్నర పాటు ఈ విచారణ కొనసాగింది.

’అదే మా నాన్న చేసిన తప్పు’
ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, తమ ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని మోహన్‌బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ వివాదం తమ మనసులను ఎంతో బాధపెడుతోందని పేర్కొన్నారు. తమను విపరీతంగా ప్రేమించడమే తన నాన్న చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. బుధవారం మీడియా తో ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరమని మంచు విష్ణు పేర్కొన్నారు. మంగళవారం ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, తన నాన్న మొహంమీద మైకు పెట్టడంతో క్షణికావేశంలో కొట్టారని వివరించారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మాట్లాడానని తెలిపారు. ఆ ఘటన అలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు.

ఫిల్మ్ ఛాంబర్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన
మీడియా ప్రతినిధి రంజిత్ పై మోహన్ బాబు దాడి ఘటనను జర్నలిస్ట్ సంఘాల తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ ఎదుట సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్ , అల్లం నారాయణ తదితరులతో పాటు యూనియన్ నాయకులతో కలిసి భారీ ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలు ధరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్‌బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆయనపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. మోహన్ బాబు జర్నలిస్టుపై ఓ ఉన్మాదిలా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రౌడీలా రంజిత్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు మోహన్ బాబు ఇంకా క్షమాపణలు చెప్పలేదన్నారు. వాళ్ల కుటుంబ సమస్య బజారున పడ్డాక కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుందని వెల్లడించారు. మీడియాపై మంగళవారం జరిగింది ముమ్మటికీ క్రూరమైన దాడేనన్నారు. మోహన్ బాబుపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులపై దాడి సరికాదు : మంత్రి పొన్నం
మోహన్ బాబు వారి కుమారుడు వ్యక్తిగత పంచాయతీలో జర్నలిస్టు పై దాడి సరికాదని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జర్నలిస్టు లకు ప్రజాపాలన ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జర్నలిస్టులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రిపోర్టర్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ , వైద్య శాఖ అధికారులకు చెప్పడం జరిగిందని, దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
00000

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News