బెంగళూరు : ముడా స్థలం కేటాయింపు కేసు దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త పోలీసులు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైన, ఆయన భార్య పార్వతిపైన ఆరోపణలను సాక్షాధారాల లేమి కారణంగా రుజువు కాలేదని బుధవారం తెలియజేశారు. తాము తుది నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ‘కేసులో మొదటి నిందితుని నుంచి నాలుగవ నిందితుని వరకు వచ్చిన ఆరోపణలు సాక్షాధారాలు లేని కారణంగా రుజువు కాలేదు. తుది నివేదికను హైకోర్టుకు అందజేస్తున్నాం’ అని లోకాయుక్త పోలీసులు ముడా కేసులో ఫిర్యాదీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో తెలియజేశారు.
ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఆయన బావమరిది మల్లికార్జున స్వామి, స్థలం యజమాని దేవరాజు కూడా నిందితులుగా ఉన్నారు. 2016 నుంచి 2024 వరకు 50:50 నిష్పత్తిలో పరిహారం ప్లాట్లు అందజేసిందని మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా)పై వచ్చిన ఆరోపణలపై మరింత దర్యాప్తు నిర్వహించనున్నట్లు, సిఆర్‌పిసి 173(8) సెక్షన్ కింద హైకోర్టుకు అదనంగా తుది నివేదిక సమర్పించనున్నట్లు లోకాయుక్త పోలీసులు వివరించారు. ముడా స్థలం కేటాయింపు కేసులో ముడా ‘కొనుగోలు చేసిన’ సిద్ధరామయ్య భారతి భూమి ఉన్న ప్రదేశంతో పోలిస్తే అధిక ఆస్తి విలువ ఉన్న మైసూరులోని విలాస ప్రాంతంలో ఆమెకు పరిహార స్థలాలు కేటాయించినట్లు ఆరోపించడమైంది.
పార్వతికి గల 3.16 ఎకరాల స్థలానికి బదులుగా 50:50 నిష్పత్తి పథకం కింద ఆమెకు ముడా ప్లాట్లు కేటాయించింది. ఆమె స్థలంలో ముడా ఒక రెసిడెన్షియల్ లే ఔట్‌ను అభివృద్ధి చేసింది. ఆ వివాదాస్పద పథకం కింద రెసిడెన్షియల్ లే ఔట్‌ల ఏర్పాటుకు స్థలం యజమానుల నుంచి కొనుగోలు చేసిన అభివృద్ధి చేయని స్థలానికి బదులుగా వారికి 50 శాతం అభివృద్ధి చెందిన స్థలాన్ని ముడా కేటాయించింది. మైసూరు తాలూక కసబ హొబ్లి కసరె గ్రాంంలో సర్వే నంబర్ 464లో ఆ 3.16 ఎకరాల స్థలంపై పార్వతికి చట్టబద్ధమైన టైటిల్ ఏదీ లేదని ఆరోపణ వచ్చింది. కాగా, లోకాయుక్త, ఇది ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.