Friday, September 20, 2024

ఓటుకు నోట్ కేసులో సిఎం రేవంత్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ హైకోర్టుకు బదలాయించాలనే అప్పీలును శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2015 నాటి క్యాష్ ఫర్ ఓటు కేసు తెలంగాణ హైకోర్టులోనే జరగడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై కేసు విచారణ స్వరాష్ట్రంలోనే జరిగితే సాక్షులను బెదిరించడం లేదా దర్యాప్తును పక్కదోవ పట్టించడం జరుగుతుందని , దీనిని భోపాల్‌కు మార్చాలని పిటిషనర్లు కోరారు.

అయితే ఈ అవసరం లేదని పేర్కొన్న న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ విషయంలో కొన్ని కీలక సూచనలు వెలువరించింది . ఈ కేసు విషయంలో సిఎం ఏ విధంగా కూడా జోక్యం చేసుకోరాదని, చట్టం తన పనితాను చేసుకువెళ్లే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ప్రాసిక్యూషన్ విషయంలో ఎసిబి డైరెక్టర్ జనరల్‌కు కీలక ఆదేశాలు వెలువరించారు. దర్యాప్తు క్రమంలో ఏ విషయాన్ని కూడా తెలంగాణ సిఎంకు నివేదించరాదని స్పష్టం చేశారు. కేసు విచారణ బదలాయింపు పిటిషన్ రాజకీయ దురుద్ధేశపూరితం అని సిఎం తరఫున న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News