Wednesday, January 22, 2025

మంత్రి గంగులకు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. 2016 ఎన్నిక పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మంత్రి గంగుల స్పందించారు. న్యాయం, సత్యమే ఎప్పటికీ గెలుస్తుందన్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని వారే దొడ్డి దారిన అడ్డుకోవాలని చూస్తారన్నారు. బుధవారం హైకోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా గంగుల కమలాకర్ బయటకు వచ్చాడు. ప్రజా సేవ కోసం వచ్చిన వారిని అబద్ధపు కేసులతో అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. బుధవారం నామినేషన్ వేసిన సందర్భంగా ఈ తీర్పుతో ఆ దేవుడే నా పక్షాన నిలిచాడని ఆయనన్నారు. ప్రజా మద్దతుతో కరీంనగర్‌లో డబల్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని, ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేసిన రోజే హైకోర్టు తీర్పు రావడం ఆ దేవుడు సైతం తనకు అండగా ఉన్నాడని భావిస్తున్నానని అన్నారు.

ఎన్నికల వ్యయం పెరిగిందని పొన్నం ప్రభాకర్ వేసిన కేసును నేడు హైకోర్టు కొట్టి వేసిందని, గతంలో బండి సంజయ్ వేసిన కేసులోనూ హైకోర్టు అతనికి జరిమానా విధించి మొట్టికాయలు వేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా కరీంనగర్లో నామినేషన్ వేసిన అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ న్యాయమే దిక్సూచిగా ప్రజాసేవ కోసం పనిచేస్తున్న తనను కరీంనగర్ ప్రజలు ఇప్పటికే వరుసగా ఐదుసార్లు గెలిపించారని, కౌన్సిలర్ గా, కార్పోరేటర్ గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం వెనక ప్రజలతో తనకున్న సాన్నిహిత్యమే కారణమన్నారు. దీన్ని సహించలేని ప్రతిపక్షాలు కుట్రలతో కేసులు వేస్తే న్యాయం తన పక్షాన ఉంది కాబట్టే వీగిపోతున్నాయి అన్నారు, ఎన్నికల వ్యయమైన, మరేదైనా న్యాయాన్ని, చట్టాల్ని అత్యంత గౌరవించే వ్యక్తిగా ఎల్లప్పుడూ పాటిస్తానన్నారు.

ఈ తీర్పుతోనైనా ప్రతిపక్షాలు తమ కుత్సిత బుద్ధి వీడి ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నన ఉన్న తనను విమర్శించడం మానుకోవాలని హితువుపలికారు. రాబోయే ఎన్నికల్లోను ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని, కరీంనగర్ లో ప్రజా ప్రతినిధిగా గెలుపుల్లో డబల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి గంగుల ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News