Wednesday, January 22, 2025

హిందూ ఏకతను పార్టీలు సాధిస్తాయా?

- Advertisement -
- Advertisement -

ఆధ్యాత్మికత, ధార్మికత అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మన దేశంలో మాదిరిగా దాన్ని రాజకీయాలకు జోడించివాడుకోవడం అనేది ఎక్కడా కనపడదు!? మతం అనేది వాస్తవంగా వ్యక్తిగత విశ్వాసం తప్ప రాజకీయ అనుచితాలు దానికి పట్టవు! వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినా కొందరు ముస్లిం పాలకులు మతోన్మాదంతో గుళ్ళు, గోపురాలు ధ్వంసం చేసినా హిందూమతం పునాదులు కదిలించలేకపోయారు. బ్రిటీష్ పాలకులు మరికొన్ని వందల ఏళ్ళు భారత దేశాన్ని పాలించినా హిందూ మతం పునాదులు కదిలించలేకపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఈ దేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధికి కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అది ఎంత మాత్రం వాస్తవం కాదు! వ్యక్తిగత విశ్వాసం అయిన మతాన్ని తామే కాపాడుతున్నారని ఎవరైనా చెప్పినా నూటికి నూరు పాళ్ళు అబద్ధమే? అది వారి రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటున్నట్లు లెఖ్ఖ!? బ్రిటిష్ వారు మన దేశం వదిలి వెళ్తూ ముస్లిం, హిందూ మతాల మధ్య ఆరని రాజకీయ చిచ్చురగిల్చి వెళ్ళాడు.

వారు దేశం విడిచి వెళ్ళి 76 సంవత్సరాలు అవుతున్న ఇంకా మతాల చిచ్చును రాజకీయ మతాబులుగా వెలిగించుకుని, మత మౌఢ్యాన్ని ప్రజల్లో రగుల్చుతూ కాలం వెళ్ళదీస్తున్నాము. విభజించి పాలించు రాజకీయ కుట్రకు ప్రజలు సమిధలుగా మారుతూనే ఉన్నారు. భారత దేశంలో సంఘ్ పరివార్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత హిందూ ధర్మం ఉద్ధారకులుగా తమకుతాము మారిపోయి రాజకీయ కంపులోకి ఆధ్యాత్మికాన్ని ఇంపుగా దించేశారు. కడుపుకు తిండిలేక పోయినా పర్వాలేదు మతం సిద్ధాంతంగా అది మారిపోయింది. 1980 దశకంలో సంఘ్ పరివార్ రాజకీయాల్లో బిజెపికి వెన్నుదన్నుగా మారిన తర్వాత బాబ్రీ, రామజన్మ భూమి వివాదం రాజకీయమైంది. ఇటుకల యాత్ర, అద్వానీ రథయాత్ర తర్వాత బిజెపికి మతం అనే ఆయుధం తేలిగ్గా ప్రజలను విభజించి బలం పెంచుకోగలిగిన శక్తిగా మారింది. ఎలాంటి ప్రజా సమస్య ప్రస్తావించకుండా రెండు సీట్ల నుండి 200 సీట్లకు బిజెపి ఇదే పెట్టుబడితో ఎదిగింది.

అయితే అద్వానీ, వాజ్‌పేయీ కొన్ని విలువలకు కట్టుబడి మత రాజకీయాలకు వాడుకున్నారు. మోడీ అనబడే వ్యక్తి అధికారంలోనికి రావడానికి, ఆయన ప్రభ వెలిగించడానికి గుజరాత్ గోధ్రా అల్లర్లు ఉపయోగపడినాయి అనడంలో సందేహం లేదు. 2014లో మోడీ, అమిత్ షా ద్వయం అధికారంలోనికి రావడానికి ఎన్నో అలవికాని వాగ్దానాలు చేశారు. అక్కడ నుండి సంఘ్ పరివార్ ఎజెండాను తమ పరిపాలక ప్రధాన భూమికగా చేసుకొని పని చేశారు. షరియత్ రద్దు, ఎన్‌ఆర్‌సి, జమ్ముకశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు ఇత్యాది అంశాలు ముఖ్యమైనవి. రైతులు, కార్మికుల విషయంలో చేసిన నల్లచట్టాలు వివాదాస్పదం అయ్యాయి. కార్పొరేట్ శక్తులకు దేశం అనేక ఏళ్ళుగా కష్టపడి సంపాదించిన ప్రభుత్వరంగ సంస్థలు అమ్మకం వలన యువత నిరుద్యోగం బారినపడింది. రెండవసారి మోడీ అధికారంలోనికి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. రూపాయి మారకం విలువ పడిపోయింది. ప్రజల్లో అసంతృప్తి ప్రబలింది.

తమ ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి చేరింది? దాని నుండి బయటపడడం కోసం ప్రతిపక్షాల ప్రభుత్వాలపై గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టడం, ప్రతిపక్ష నేతలపై ఇడి, సిబిఐ, ఐటి సంస్థలు దాడులకు పురిగొల్పడం పెరిగింది. మోడీ, అమిత్ షాల ద్వయం కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూలకొట్టడానికీ వెనుకాడలేదు. వీటన్నింటి పర్యవసానం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారిపోయింది. తిరిగి తమకు తెలిసిన హస్తలాఘవం ప్రదర్శనకు సన్నద్ధం అయ్యారు. అందులో భాగమే మోడీ కర్నాటక ఎన్నికల ‘జై భజరంగ్ భళీ’ నినాదం! కాలం చెల్లిన మత రాజకీయాలను చెంప పగులగొట్టారు కర్నాటక ప్రజలు. ఇక తెలంగాణలో డబులింజన్ సర్కార్ గురించి బిజెపి గత రెండేళ్లుగా ప్రయత్నం చేసింది. ఏ ప్రయోగం సఫలం కాలేదు. ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ ఏక్తా యాత్ర జరుపుతారు. బండారు దత్తాత్రేయ లాంటి పెద్దలు అలైబలై పేరుతో వివిధ మతాలను, కులాలను ఏకం చేసే ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమం నిర్వహించిన అడుగుజాడలు ఉన్నాయి.

వాటిని కాదని తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పాలు, నీరులా కలిసిపోయిన వివిధ కులాల మధ్య మళ్ళీ మంటలు రేపడం హిందూ ధర్మం పేరుతో ఎంత వరకు సబబు! అనేక ఉద్యమాలు చవిచూసిన నేల తెలంగాణలో మతోన్మాద పప్పులు ఎంత మాత్రం ఉడకవుగాక ఉడకవు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News