Monday, December 23, 2024

రాష్ట్రంలో బిజెపి విద్వేష రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన సంస్థలేవీ తెలంగాణలో ఆదరణ పొందలేదు. ఆర్యసమాజ్‌కి తెలంగాణలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన హిందువులను వారు శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల సద్భావం కలిగి వుండేవారు. పండిత నరేంద్రదేవ్ వంటివారు దాన్ని స్పష్టంగా చెప్పారు కూడా. వారికీ, ఆర్‌యస్‌యస్‌కీ పడేది కాదు. 1940-51 నిజాం వ్యతిరేక పోరాటంలో– 1925లో స్థాపించబడిన ఆర్‌యస్‌యస్, 1915లో స్థాపించబడిన హిందూ మహాసభ వంటి హిందూ మత, రాజకీయ సంస్థల పాత్ర సున్న. 1952 ఎన్నికల్లో వారు ఐదు సీట్లు మాత్రం పోటీ చేశారు; మొత్తం ఐదున్నర వేల ఓట్లు తెచ్చు కొన్నారు. ఇప్పుడేమో రాష్ట్ర అధికార పగ్గాలు చేబూనాలని మతాన్ని విద్వేష వనరుగా వాడుతున్నారు.

BJP could not win single seat in by-elections

తమ పార్టీ 2023లో తెలంగాణలో అధికార పార్టీగా రావాలని, వస్తుందని అమిత్ షా గతంలోనే లక్ష్య ప్రకటన చేశారు. అందులో తప్పేమీలేదు. కానీ హోం మంత్రిగా బాధ్యతలని విస్మరించి అమిత్ షా, -మోడీ నేతృత్వంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు చేస్తున్నారు. వారు అనుసరిస్తున్న పద్ధతి బరితెగించిన మతోన్మాద మార్గం. పార్టీ నాయకులు, పార్టీ సభ్యత్వాన్ని పెంచలేకపోతే తమని కాంటాక్టు చేయాలని, ప్రతి జిల్లాలో తానా పని చేయగలనని ‘హోం మంత్రి షా’ చెప్పి, స్థానిక నాయకుల్ని ‘హెచ్చరించారు, మర్మంగా వ్యాఖ్యానించార’ని టైమ్స్ ఆఫ్ ఇండియా (2019 జూలై 7) రిపోర్ట్ చేసింది. ఆరు నెలల్లోనే బిజెపి ఓటు 7.5 నుంచి 22 శాతానికి పెరిగిందని, అగ్ర కులాలలో ఓటు 13 నుంచి 41 శాతానికి పెరిగిందని, ఈ సానుకూలతను పోగొట్టుకోరాదని అగ్రకులతత్వాన్నీ జోడించారు. భారతీయులంతా, హిందువులంతా ఒకటే, సబ్ కా సాథ్ అని మాటల్లో చెప్పే ‘మహా నాయకులు’ దేశమంతటా అన్ని విధాలా చీల్చే మత, కుల, ప్రాంతీయ తత్వాల్ని బాహాటంగా ప్రోత్సహిస్తున్నారు. కంచే చేను మేస్తున్నది!

హోం మంత్రిగా తమ విధులకు పూర్తి విరుద్ధంగా ఆయన, మరోకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (తెలంగాణ) వారి కనుసన్నలలోనే స్థానిక నాయకులు బండిసంజయ్, రాజాసింగ్ తదితరులు అదే పనిగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఇది ఒక పథకం ప్రకారం మోడీ, షాల కేంద్ర నాయకత్వమే ప్రోత్సహిస్తున్నదని స్పష్టమవుతున్నది. తమ పార్టీ భిన్నమైనదని, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. కానీ వారి ఆచరణ ప్రజల్లో చిచ్చుపెట్టే రీతిలో ఉందని కనబడిపోతున్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వీరిది ఇదే తంతు. 2018 డిసెంబర్లో వికారాబాదు ఎన్నికల సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ‘బిజెపి అధికారంలోకి వస్తే హైదరాబాదు నుంచి నిజాం పారిపోయినట్టే ఒవైసీ సోదరుల పలాయనం తప్పద’ని చెప్పారు.

ఇక్కడి చరిత్ర కాస్త తెలిసిన బిజెపి నాయకులైనా సరిదిద్దాల్సింది. కానీ అబద్ధాలతోనే జైత్రయాత్ర చేయవచ్చునని నమ్మే పాలకవర్గ శ్రేణులకు ఆ ఇంగితం కూడా లేకుండాపోయింది. ఈ మధ్య స్థానిక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ‘మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే ఒవైసీ సోదరులను పాకిస్తానుకి తరిమికొడతాం’ అన్నారు. ఒవైసీలది శతాబ్దాలుగా హైదరాబాదులో నివసించిన కుటుంబం అని ఆయనకు తెలియదా? లండన్ లో చదువుకున్న అసదుద్దీనేకాదు, ఈ ఒవైసీల తండ్రి సలావుద్దీన్ సైతం అలీఘడ్‌లో చదువుకున్న విద్యావంతుడు; రాజాసింగ్ (1977) పుట్టక ముందే ఐదుసార్లు ఎంఎల్‌ఎగా, ఆరుసార్లు యంపిగా ఎన్నికైన నాయకుడు. బండారు దత్తాత్రేయవంటి సీనియర్ బిజెపి నాయకులను అడిగితే తను, కిషన్ రెడ్డి వంటి బిజెపి నాయకులంతా ఒవైసీలతో ఇఫ్తార్ పార్టీలల్లో పాల్గొన్న వారమే అని చెబుతారు. ఆయన ప్రేలాపనల వల్ల రాజాసింగ్‌ని ఫేస్‌బుక్ నుంచి తొలగించారని, నష్టం జరుగుతుందని కొన్నాళ్ళ పాటు బిజెపి పార్టీ నుంచీ దూరంపెట్టారని గుర్తు చేయాలి. అయినా వెనుకటి గుణమేలమాను కదరా సుమతీ!.

Amit-Shahs-And-Modi

ఒవైసీ కుటుంబం అనేక విద్య, వైద్య (మెడికల్ ఇంజినీరింగ్) సంస్థలను దశాబ్దాలుగా నడుపుతున్నదని ఇక్కడి ప్రజలకు తెలుసు. ఆ సంస్థల్లో ఎందరో హిందువులు పని చేస్తున్నారు, ప్రయోజనం పొందుతున్నారు. మజ్లిసు పార్టీ తరఫున హిందువులు కూడా హైదరాబాదులో పోటీ చేసి గెలవటమే కాదు, మూడుసార్లు మేయరుగా కూడా పని చేశారు. ముస్లిం వ్యతిరేక ద్వేషాగ్నిని రగిలించి అధికారం ‘చుట్ట’పెట్టుకుందామని బిజెపి నాయకత్వం బరితెగించింది. హిందూ దేవాలయం నుంచి తమ ప్రచారయాత్రను ప్రారంభించటాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. దానికైనా ‘లష్కరు బోనాల’ కేంద్రం ఉజ్జయినీ దేవాలయంని కానీ, పోనీ ఇటీవల పేరుగాంచిన పెద్దమ్మగుడిని కానీ ఎంపిక చేసుకోలేదు.

దానికిబదులు, చార్మినార్ పునాదుల వద్ద ‘శాంతియుతం’గా కొలువైవున్న భాగ్యలక్ష్మీ విగ్రహాన్ని తమ ముస్లిం వ్యతిరేక విద్వేషానికి వాడుకో జూస్తున్నారు. ఈ మధ్య కేంద్రం నుండి ఏ బిజెపి నాయకుడు వచ్చినా భాగ్యలక్ష్మి గుడి సందర్శన అనివార్యమై పోయింది. పాతతరం, పాతతరహా నాయకత్వాన్ని పక్కకుబెట్టి, రాజా సింగ్ లాంటి వదరుబోతు నాయకులను ముందుకు తెచ్చారు కేంద్ర నాయకత్వం మోడీ, అమిత్ షాలు. దేశ వర్తమానంలోని చేదుని మరుగునపెట్టడం వారి లక్ష్యం. తమ ఉన్మాదాలనే దేశభక్తిగా చిత్రించి, రాజకీయ పబ్బం గడుపుకోవటం వారికి నిత్యకృత్యం. దేశభక్తి పేరిట సత్యం వధ, ధర్మం చెర- అనేదే వారి రాజకీయం. గోముఖ వ్యాఘ్రం, మేకవన్నెపులి వారికి బాగా నచ్చిన ‘దసరా వేషాలు’. పార్టీ రాజా సింగ్‌ను సస్పెండ్ చేస్తుంది. తగిన సమాధానం చెప్పి త్వరలో మళ్ళీ పార్టీలోకి వస్తానని ఆయన ప్రకటిస్తాడు. ఈలోగా సంఘ పరివారమంతా సస్పెండ్ అయిన నాయకుడు చేసింది చాలా కరెక్టు అని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతుంది.

బిజెపి దారేవేరు. డీమోనిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు) ప్రజలపై మెరుపుదాడి అంటే, అదే తమ ఘనకార్యం అంటారు. మైనారిటీలపై, దళితులపై అమానుష దాడులేమిటీ అంటే, గోపూజ చెయ్యద్దా అంటారు. ప్రపంచమంతా మే డే జరిపితే, బిజెపి విడిగా విశ్వకర్మదినం పాటిస్తుంది. దేశమంతటా టీచర్సుడే, వారిది విడిగా గురుపూజ. మేధావులకు బెయిలులేని జెయిలేమిటి అంటే, రాజద్రోహం, అర్బన్ నక్సల్స్ అని గావుకేకలు పెడతారు. రాజద్రోహ చట్టమే కాలం చెల్లినదని సుప్రీంకోర్టు చెప్పింది గదా అంటే వాళ్ళను అరెస్టు చేసినప్పుడు చట్టం వుందిగదా అంటారు. ప్రతి సెప్టెంబరులోనూ తెలంగాణ విమోచన ఉత్సవం అంటూ ఊగిపోతారు. ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన పొందింది అని పొంగిపోతారు. ఆనాటి తెలంగాణ ప్రజా పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా సాగినదికాదు.

రాజరికానికి వ్యతిరేకంగా చేసినది. ఆ పోరాటంలోముస్లిం రైతు షేకు బందగీ, విప్లవకవి మఖ్దూం మొహియుద్దీన్, ఫతేవుల్లాఖాన్ వంటి కార్మికనాయకులు, జవ్వాద్రజ్వీ వంటి విద్యార్థి నాయకులు, బాఖరుల్లా ఖాన్ వంటి ముస్లిం వకీళ్లు, షోయబుల్లాఖాన్ ఎడిటరుగా వుండినఇమ్రోజ్, మీజాను వంటి ఉర్దూ పత్రికలు, నిజాంకి వ్యతిరేకంగా చేసిన కృషిని మరిచిపోలేము. భద్రాచలం వంటి అనేక గుడులకేగాదు, నిజాం కాశీ విశ్వవిద్యాలయానికీ 1939లో రూ. లక్ష, అలీఘడికి రూ. 50 వేలు విరాళం ఇచ్చారు. బ్రిటిషు వారికి మద్దతు, విమానాల విరాళం ఇవ్వటమేకాదు; పూర్వపు నిజాం టిప్పుసుల్తాన్ని ఓడించటానికి కారన్‌వాలిస్ సేనలకు కూడా సాయం చేసారు. రాజరికాలు తమ రాజరికాన్ని కొనసాగించటానికి కావలసిన విధానాలు అవలంబించారు. కానీ కేవలం మతం ప్రాతిపదిక మీద కాదు.

హిందూ దొరలు నిజాం ప్రభుత్వంలో ముఖ్యపాత్ర వహించి, రాజభక్తి పరాయణులుగా ఉంటూ, తమ ఫ్యూడలిజాన్ని కాపాడుకున్నారు. వారిలో మెజారిటీ కాంగ్రెసు స్థాపన తర్వాత కూడా అందులో చేరకపోగా ఆమడదూరంలో ఉండేవారు. నిజాం వ్యతిరేక పోరాట దశలో మంత్రులుగా కూడా పని చేశారు. 8 మంది హిందూ కులీనులు నిజాం రాజ్యంలో ప్రధాని పదవి కూడా (ఉదా.కి మహరాజా కిషన్ ప్రసాదు 22 ఏళ్ళ పాటు) నిర్వహించారు. అత్యంత సంపన్నుడైన నిజాంకి అప్పులిచ్చిన వారిలో ముఖ్యులు ధన్ రాజ్గిర్ వంటి హిందూ వ్యాపారులే. అటు పాలన గాని, ఇటు ప్రతిఘటన కానీ మత ప్రాతిపదికన జరిగినది కాదు. అయితే రెండు పక్షాలలోనూ మతవాదులు ప్రవేశించి ప్రాబల్యం విస్తరించుకోవటానికి ప్రయత్నించటం అబ్బురమూ కాదు. అయితే చరిత్రనంతా మత కోణంలోనే ప్రదర్శించటం మాత్రం కావాలని చేస్తున్న వక్రీకరణ. నేటి తమ రాజకీయ ప్రయోజనాలకోసం చేస్తున్న దుష్ప్రచారం. ప్రజల ఐక్యతను మత గ్రూపులుగా విభజించే కుతంత్రం

హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన సంస్థలేవీ తెలంగాణలో ఆదరణ పొందలేదు. ఆర్యసమాజ్‌కి తెలంగాణలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన హిందువులను వారు శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల సద్భావం కలిగి వుండేవారు. పండిత నరేంద్రదేవ్ వంటివారు దాన్ని స్పష్టంగా చెప్పారు కూడా. వారికీ, ఆర్‌యస్‌యస్‌కీ పడేది కాదు. 1940-51 నిజాం వ్యతిరేక పోరాటంలో– 1925లో స్థాపించబడిన ఆర్.యస్.యస్., 1915లో స్థాపించబడిన హిందూమహాసభ వంటి హిందూ మత, రాజకీయ సంస్థల పాత్ర సున్న. 1952 ఎన్నికల్లో వారు ఐదు సీట్లు మాత్రం పోటీ చేశారు; మొత్తం ఐదున్నర వేల ఓట్లు తెచ్చు కొన్నారు. ఇప్పుడేమో రాష్ట్ర అధికార పగ్గాలు చేబూనాలని మతాన్ని విద్వేష వనరుగా వాడుతున్నారు. కాబట్టి విమోచన దినం అని వారిప్పుడు చేస్తున్న హడావుడి ప్రజల దేశభక్తిని తమకు ఓట్లుగా మార్చుకునే బరితెగించిన వైనమే. రేపు రాబోయే ఎన్నికలలో రాష్ట్ర అధికారాన్ని కైవసం చేసుకోవడానికి తెలంగాణ చరిత్రను, సెంటిమెంటును తమకు అనుకూలంగా చిత్రించుకునే, తమకు లేని పాత్రను సృష్టించుకునే బూటక దుర్మార్గమే. సంవత్సర కాలం పాటు సాగే తెలంగాణ వజ్రోత్సవాలలో మరెన్ని నాటకాలు ఆడతారో, మరెన్ని విద్వేషాలు రగిలిస్తారో చూడాలి. ప్రజలారా బహుపరాక్.

ఆదిత్య కృష్ణ
7989965261

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News