Wednesday, January 22, 2025

మతం ఒక రక్షణ కవచం

- Advertisement -
- Advertisement -

‘నా దేశంలో బుద్ధిహీనుల సంత వుంది వారు అమాయక ప్రజలతో కొబ్బరి కాయలోని ఆరోగ్యకరమైన, పౌష్టిక విలువలున్న నీటిని మురికి నీటిలో పోయిస్తారు. నదిలోని మురికి నీటిని పవిత్ర జలంగా నమ్మించి తాగిస్తారు” అని అన్నారు డా. బి.ఆర్. అంబేడ్కర్. ప్రపంచ వ్యాప్తంగా నిరంతరం ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇందులో చిన్నచితకవి కొన్నయితే, పెద్ద ఎత్తున జరిగేవి మరికొన్ని. ఆకలి తట్టుకోలేకో, పేదరికంలో మగ్గిపోలేకో చేసే చిన్నచిన్న నేరాలకు తప్పక శిక్షలంటాయి. అదే అధికార బలంతోనో, అండదండలతోనో జరిగే వాటికి శిక్షలుండవు. ముఖ్యమంగా మన దేశంలో మతపరంగా, కులపరంగా, వర్గపరంగా విభజింపబడి వున్న చోట అధిక సంఖ్యాకులు ఎలా మోసపోతుంటారో చూద్దాం. జనంలో అధిక సంఖ్యాకులు వీళ్ళే గనక.. జాగ్రత్త పడాల్సిందే వీళ్ళే! మతం నైతిక విలువల్ని పెంచేదే గనక అయితే, ఫాదర్‌లు, పూజారులు, ముల్లాలు చిన్న పిల్లల్ని రేప్ ఎందుకు చేస్తారూ? మత విశ్వాసకులు మానవ బాంబులుగా ఎందుకు తయారవుతారూ? మతం అంటేనే ఊహాజనితం అందులో మరి సత్యానికెక్కడ తావుందీ? అట్లని అబద్ధం చెప్పే హక్కు కూడా మతానికి లేదు.

ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టి మరణించిన యువకుడిని స్పస్థత ప్రార్థనతో తిరిగి ‘బతికించాడు’ ఒక ఎవాంగ్లిస్ట్ పాల్ దినకరన్ షో రక్తి కట్టించాడు. కాని, అనారోగ్యంతో చనిపోయిన తన తండ్రిని బతికించుకోలేకపోయాడు. క్రీస్తు విగ్రహానికి హృదయం వుండే చోట ఎల్‌ఇడి లైట్లు కనపడకుండా అమర్చి, మహత్తు కింద మార్చి జనాన్ని మోసం చేస్తున్నారు. పాస్టర్ మిలన్ ముప్పయి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కొందరిపై అత్యాచారం చేశారు. చివరకు మేకల దొంగతనం చేసులో పట్టుబడ్డాడు. ఈయన తమిళనాడు, తిరునల్వేలి జిల్లా, ఉక్కిరన్ కోట ప్రాంతానికి చెందిన పాస్టర్. ఒక ఎఫ్.బి.డాట్‌కామ్ క్రిస్టియన్ ట్రూతర్స్ యునైటెడ్ వారు ఈ విధంగా ప్రకటించారు. “మీ ఆదాయంలో పెద్ద మొత్తం దేవుడికి ఇమ్మని నేను సూచిస్తాను. దేవుడికి ఇమ్మంటున్నానంటే, అది నా కివ్వమంటున్నానన్న మాట. మల్టీ మిలియన్ డాలర్లతో నేను మరో కొత్త భవనం కొనుక్కొంటానన్న మాట. దైవ విశ్వాసకులు మాత్రం వారి దైనందిన కార్యక్రమాలకు సరిపడనంత డబ్బు లేక ఇబ్బంది పడుతుంటారు.

అది వేరే విషయమన్న మాట!” అన్ని మతాల ప్రార్థనా స్థలాలలో ఫ్యాన్లు, కూలర్లు పెట్టడం చూస్తుంటాం. అవి దేవుడికి కాదు, పూజారుల కోసమని అనుకోవచ్చు. కాని ఉత్తర భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో దేవుడి విగ్రహాలకు ఉన్ని బట్టలు తొడిగారు. అసలు దేవుడే ఒక భ్రమ అయితే, మళ్ళీ భ్రమలకు చలి పెట్టడాలు, ఉక్కపోతలూనా? గుడ్డితనం వ్యక్తిని మాత్రమే బాధిస్తుంది. గుడ్డి నమ్మకాలు వ్యవస్థను అంధత్వంతో పీడిస్తాయి. ప్రార్థనా స్థలాల ముందు ఆకలితో అడుక్కునే వారికి దేవుడు పట్టెడన్నం పెట్టలేకపోతుంటే ఇక కోట్ల మంది కోర్కెలు ఎలా తీర్చగలడూ? మత ఛాందసం, బూజుపట్టిన భావజాలం మెదడ్లలో నింపుకున్న వారు చేస్తున్న అకృత్యాలు రోజూ కళ్ళ ముందే చూస్తున్నాం. పదిహేడేళ్ళ పెళ్ళి కుమార్తె తను కన్యనే అని తొలి రాత్రి భర్తకు నిరూపించలేకపోయింది. భర్త ఆమెను శోభనం గదిలోనే చంపేశాడు. మనం 21వ శతాబ్దంలోనే వున్నామా? ఎవరు, ఎవరినైనా, ఎక్కడైనా చంపేయగల ఆటవిక సమాజంలో వున్నామా? సన్నగా, పీలగా, బలహీనంగా వుండే ఆ పెళ్ళి కూతురు శోభనం గదిలో తనను తాను రక్షించుకోలేకపోయింది. ఆటలాడే కన్నె పిల్లలకు కన్నెపొర చిరిగిపోవడం సహజం.

‘వధూవరులు అగ్నిచుట్టూ ఏడుసార్లు ఎందుకు తిరుగుతారు?’ అన్న దానికి వేద సైన్స్ పండితులు ఇచ్చే వివరణ ఇలా వుంటుంది ఒక వృత్తంలో 360 డిగ్రీలుంటాయి. అది 1 నుండి 9 సంఖ్యలలో ఒక్క ఏడుతో తప్ప అన్నింటితో విభజింపబడుతుంది. అందువల్ల అలా ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ జంట విడిపోకుండా’ వుంటారని అందులోని గూడార్థమట. మరి అలా హిందూ సంప్రదాయాల ప్రకారం పెండ్లి చేసుకొని కూడా ఎందరో విడిపోతున్నారు కదా? మరి ఈ సూడో సైన్స్ పండితులు దీనికి కారణాలేమైనా చెపుతారా? యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో కొప్పుల రాంరెడ్డి ‘కొరుకుడు బాబా’ అవతారమెత్తాడు.

ఆడామగా అని తేడా లేకుండా రూ 200 ఫీజు తీసుకొని మీదపడి కొరుకుతాడు. తన పంటి గాటు పడితే రోగాలు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనీ ప్రచారం చేసుకున్నాడు. ఆడవారి ఒళ్ళంతా తడమడం, మగవారిని పడుకోబెట్టి తొక్కడం చేస్తుంటాడు. కొరుకుడు బాబా బాగోతం వీడియోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. పోలీసులు స్పందించి తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అలాగే మరో మహిళ సుగుణమ్మ కూడా దేవుడు పూనాడని శిగాలు ఊగుతూ వుంటే, జనాన్ని మోసం చేస్తూ వుంటే అరెస్టు చేశారు. అందుకే జనం విద్యావంతులైతే సరిపోదు. వివేకవంతులు కావాలి. విజ్ఞులు చెప్పే విషయాల గూర్చి ఆలోచించుకుంటూ వుండాలి. ప్రఖ్యాత తెలుగు అభ్యుదయ కవి ఆరుద్ర అంటారు “ దేవుడి మీద తిరగబడలేని వాడు ప్రజలను మార్చలేడు. ప్రజలను మార్చకపోతే మూఢాచారాలు అంతరించవు. మూఢాచారాలున్నంత కాలం అభ్యుదయం సాధ్యం కాదు!” అని.

దైవ భావన ఒక పిచ్చి చెట్టయితే దానికి కాసిన ఫలాలు జోతిష్యం, వాస్తు, శాంతి పూజలు, తాయెత్తులు, కల్వరి నూనెలు వగైరా. వీటి చాటున నేర గాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారో నిత్యం మనం చూస్తూనే వున్నాం. బెంగళూరులో జరిగిన ఒక తాజా ఉదాహరణ… విద్య ఇరవై నాలుగేళ్ళ బిసిఎ గ్రాడ్యుయేట్. తలిదండ్రులు విడిపోయినందు వల్ల ఒంటరిదైంది. చుట్టూ ఎన్నో సమస్యలతో ప్రశాంతత కరువై టెలివిజన్‌లో జోతిష్యుడి ప్రకటనకు ఆకర్షింపబడి మోసపోయింది. వెళ్ళి ఆ జోతిష్యుణ్ణి కలిస్తే, పూజల కోసం రూ. 15 వేలు తెమ్మన్నాడు. అంతడబ్బు లేదంటే సగమైనా ఇమ్మనాడు. నానాతంటాలు పడి సగం డబ్బు చెల్లించి పూజ చేయించింది. ఎన్ని నెలలైనా ఫలితం కనిపించలేదు. వెళ్ళి డబ్బు తిరిగి ఇవ్వమని కోరింది. ఫలితం వెంటనే కనిపించాలంటే మరో పద్ధతి వుందని చెప్పాడు జోతిష్యుడు. ఒక రాత్రి బ్రాహ్మణుడితో గడపాలని చెప్పాడు. ఆమె ఒప్పుకోక డబ్బు వాపసు కావాలని పట్టుబట్టింది. తర్వాత ఇస్తానని నమ్మించి వెనక్కి పంపించాడు. మరి కొన్ని రోజులకు జోతిష్యుడే అమ్మాయికి ఫోన్ చేసి పిలిచాడు. తన గురువు వచ్చారని ఆయనైతే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతాడని చెప్పి, అమ్మాయిని మరొకతనికి అప్పగించి వెళ్ళిపోయాడు.

ఆ గురువు అరగంట పూజ చేసి, బొడ్డులో కుంకుమ వేయాల్సి వుంటుందని అందుకు అమ్మాయి సహకరించి బట్టలిప్పాలని అన్నాడు. అమ్మాయి ఒప్పుకోలేదు. అప్పుడా గురువు గారే బలవంతంగా బట్టలిప్పే కార్యక్రమం ప్రారంభించాడు. అమ్మాయి విషయం గ్రహించి, తప్పించుకొని పారిపోయింది. తర్వాత మరో రోజు స్నేహితురాల్ని వెంట బెట్టుకొని జోతిష్యుడి దగ్గరకు వెళ్ళింది. డబ్బు తిరిగి ఇవ్వమని గొడవ చేయడానికే వెళ్ళింది. అతని గదికి తాళం కనబడింది. తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళినా తాళమే కనిపిస్తోంది. జోతిష్యుడి గురించి ఆరా తీస్తూ చుట్టు పక్కల వారిని అడుగుతూ వుంటే ఎవరో ప్రొఫెసర్ నరేంద్ర నాయక్ నెంబరిచ్చారు. ఆయన హేతువాద సంఘ ఫెడరేషన్ అధ్యక్షుడు. అమ్మాయి ఆయనకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆయన రంగంలోకి దిగి, ఆధారాలు సేకరించి, కేసు పోలీసులకు అప్పగించాడు. గురుశిష్యులైన జోతిష్యుల్ని కటకటాల వెనక్కి పంపాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి.

అన్నీ పత్రికల్లో రావు. అన్నీ మీడియాలో కనబడవు. సామాన్యులే వివేకవంతంగా ఆలోచిస్తూ మసలుకుంటూ వుండాలి. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలలో జోగినుల పరిస్థితి దారుణంగా వుంటుంది. యుక్త వయసు రాగానే జోగినిని చేసి ఇంట్లోంచి పంపిస్తారు. పేరుకే దేవుడి భార్య. కాని సమాజంలోని పెద్ద మనుషులకు ఆమె ఉమ్మడి ఆస్తి. యవ్వనం వున్నన్ని రోజులు బాగానే బతుకుతారు. ముసలితనంలో కష్టాలు మొదలవుతాయి. వాడుకున్న పెద్ద మనుషులెవరూ ఆదుకోరు. పోనీ వృద్ధాప్యపు పింఛన్ కోసం ప్రభుత్వం వారు దగ్గరికిపోతే మొగుడు చచ్చినట్టు సర్టిఫికేట్ తెమ్మంటారు. ఈమె దేవుడి భార్య కదా? దేవుడు చచ్చినట్లు సర్టిఫికేట్ ఎవరివ్వాలీ? దేవుడి భార్య తల్లి కదా? మరి తల్లితో లైంగిక సంబంధం కోసం బుద్ధిలేని పెత్తందార్లంతా ఎందుకు ఎగబడినట్టూ. ప్రభుత్వాలకు కళ్ళూ చెవులూ, ఇంగిత జ్ఞానం ఏవీ లేకపోతే ఎలా? సమస్యల నుండి తమను బయటపడేసినందుకు చాలా మంది ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.

కానీ ఆ సమస్యల్ని సృష్టించింది ఎవరన్నది ఆలోచించరు. ‘నారు పోసిన వాడే నీరు పోస్తాడు’ అని అనుకుంటారు. ‘దిక్కులేని వారికి దేవుడే దిక్కు’ అని కూడా అనుకుంటారు. నిజమే! మరి ఇంతకూ ఆ దువుడెక్కడా? అద్దంలో చూసుకుంటే నీ దేవుడు కనిపిస్తాడు. అతని అభిప్రాయాలన్నీ నీ మెదడులోనే వున్నాయి. అందువల్ల అతను బయట ఎక్కడా లేదు. ‘దైవ భావన’ అన్నది మనిషి మెదడులోనే వుంది. దానిని అందులోంచి తీసేస్తే అసలు సిసలైన మనిషి మిగులుతాడు. దైవభావన భారాన్ని మోస్తూ మనిషి శతాబ్దాలు దాటి వచ్చాడు. అయినా రాను రాను మనిషి, మనిషిగా మిగలకుండా పోతున్నాడు. మనిషి ఆలోచనలతో .. మనిషి మనిషిగా వుంటేనే మనిషి బతుకుతాడు!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News