Monday, December 23, 2024

చిన్నారుల మెదళ్లలో మతబీజాలు

- Advertisement -
- Advertisement -

భారత దేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన గురువుకి రాసిన ఉత్తరంలో విషయం ఇలా ఉంది “నాకు అత్యవసరమని భావించి మీరు నాకు అరబ్బీ భాష నేర్పారు. దాని వల్ల అటు మీకూ, ఇటు నాకూ చాలా సంవత్సరాలు వృథా అయ్యాయి. ఎదుగుతున్న లేత వయసులో విద్యార్థి బుద్ధిని తేజోమయం చేయాలి గాని, మీరు నన్ను మందబుద్ధిని చేశారు. జీవితంలో ఎక్కడా ఎందుకూ ఉపయోగపడని భాష నేర్పడానికి మీరు నా జీవితంలోని విలువైన పది, పన్నెండేళ్లు వృథా చేశారు. ఆ ఒక్క భాష, అందులోని సంప్రదాయ రచనలు, అల్లాహ్ స్మరణ మాత్రమే నన్ను లోక జ్ఞానిగా, మేధో సంపన్నుడిగా చేస్తాయని మీరు ఎట్లా అనుకున్నారూ? ఉపయోగపడే విద్యను పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. వారి అభిరుచికి తగిన విధంగా జ్ఞానాన్ని అందించాల్సి ఉంటుంది.

కాగా, మీరు నా బాల్యాన్ని సర్వనాశనం చేశారు కదా? భూగోళ శాస్త్రం తెలియదు. గణితం తెలియదు. చరిత్ర తెలియదు. ఇంగ్లాండు, హాలెండ్, పోలెండ్, పోర్చుగీస్ వంటి దేశాలు ఉన్నాయని మీరు నాకు చెప్పలేదు. దేశమంటే ఏమిటో, ద్వీపమంటే ఏమిటో, ద్వీప కల్పమంటే ఏమిటో మీరు నాకు చెప్పనే లేదు. సముద్ర మట్టమంటే ఏమిటో, సముద్ర మట్టానికి ఏ దేశం, ఎంత ఎత్తున ఉందో తెలియదు. ఈ హిందూస్థాన్ బాదుషా పేరు వింటేనే ప్రపంచ దేశాల రాజులందరూ గడగడ వణికిపోతారని అబద్ధాలు చెప్పారు కదా? అబద్ధాలతో ఎవరైనా జ్ఞాన సముపార్జన చేయగలరా? ప్రపంచంలోని వేరు వేరు రాజ్యాలేవీ? వారి పాలకులెవరు? అక్కడి ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు ఎలాంటివీ? సంపత్తి గల దేశాలేవీ? విపత్తులు ఎదుర్కొన్న రాజ్యాలేవీ మాట వరుసకైనా చెప్పలేదే? ఇక మాకు విషయాలు ఎలా తెలుస్తాయీ? ప్రపంచంలో మన దేశం ఎక్కడ ఉంది? దీని బలాబలాలేమిటీ? వనరులేమిటీ? శక్తిసామర్థాలేమిటీ? వంటి విషయాలు అంచనా వేసుకోవాలంటే చుట్టూ ఉన్న దేశాల పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా? చక్రవర్తి కుమారులమైన మాకు విషయాలు తెలియాల్సిన వయసులో తెలియకపోతే ఎలా? దేశాన్ని సమర్థవంతంగా ఎలా పరిపాలించగలం?” అని మదనపడ్డాడు ఔరంగజేబు.

ఈ ఉత్తరంలో చాలా వాస్తవాలున్నాయి. ఒక భాషను బోధించడం, తర్వాత మత బోధలు చేయడం తప్ప ప్రపంచ పరిజ్ఞానానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. అతను మొఘల్ చక్రవర్తి వారసుడు గనక, అరబ్బీ నేర్పించారు. దాని ద్వారా అల్లాను పరిచయం చేశారు. దాంతో మతానికి పునాదులు వేశారు. ఆ సమయంలో హిందూ కుటుంబాలలో కూడా దాదాపు అదే జరిగేది. ఆ కుటుంబాలలో సంస్కృతం నేర్పేవారు. వేదాలు, పురాణాలు చదివించి, మతంలోకి దారి చూపించేవారు. ఇంకా ఇతర మతాల్లోనూ అలానే జరిగేది. దాన్నే పాండిత్యంగా ప్రకటించుకునేవారు.

ఈ విషయాన్ని పక్కన పెట్టి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ బాల్య అనుభవాల్ని చూద్దాం జర్మనీ మ్యూనిచ్ నగరంలోని ఒక కేథలిక్ స్కూల్లో చదువుకున్న ఐన్‌స్టీన్ అక్కడి మత బోధనలకు, వారి పద్ధతులకు విసిగి తర్వాత కాలంలో ఇలా రాసుకున్నారు. “నాకు పన్నెండో యేట నుండి పాఠశాల మీద, ఉపాధ్యాయుల మీద అపనమ్మకం ప్రారంభమైంది. స్కూలు నన్ను ఫెయిల్ చేసింది. నేను స్కూలును ఉపాధ్యాయులెప్పుడూ మిలట్రీ సార్జంట్లలాగా ప్రవర్తించే వారు. నాకు కావాల్సింది నన్ను నేర్చుకోనిచ్చేవారు కాదు. నా జ్ఞాన తృష్ణను ఉపాధ్యాయులు మెలిక వేసి తిప్పుతుండేవారు. ప్రభువు ప్రార్థనలు ఎంత సేపనీ?” అంటూ విసుక్కున్నాడు. ఇంగ్లీషు కవి డబ్లు.బి. ఈట్స్ అంటాడు “విద్య నేర్పడం అంటే, బకెట్ నింపడం కాదు అగ్నిని రగిలించడం!” అని! ఈ గురువులు విద్య పేరుతో దైవభావనకీ, మత బోధనలకూ ప్రాధాన్యమిచ్చారే గాని, జ్ఞానబోధ చేసింది ఎక్కడ? బకెట్లు నింపడమే గాని అగ్ని రగిలించిందెక్కడ? సమాజం లో అభ్యుదయ భావనలు చోటు చేసుకున్న దశలో ఉపాధ్యాయుడి నిర్వచనం మారింది.

ఉపాధ్యాయుడంటే స్నేహితుడు, మార్గదర్శకుడు, ప్రణాళికా నిపుణుడు, క్రమశిక్షణ నేర్పేవాడు. స్ఫూర్తి కలిగించే వాడు, తరగతి నిర్వహించేవాడు, వ్యక్తీకరించే నేర్పుగలవాడు, ఆ నేర్పు నేర్పించేవాడు, కౌన్సిలింగ్ చేసేవాడు, పరీక్ష నిర్వహణాధికారి, సృజనకారుడు, తత్వవేత్త, తండ్రిలాంటి వాడు, వసతులు కల్పించేవాడు, బోధకుడు, కౌన్సిలింగ్ నిర్వాహకుడు వగైరా. గతంలో బోధించేవారిని ‘గురువు’ అని అనేవారు. గురువు మత బోధలు చేసేవాడు. ముక్తి మార్గం చూపేవాడు. రాను రాను గురువుల అవసరం తగ్గిపోయింది. ప్రపంచ జ్ఞానాన్ని, విశ్వ రహస్యాల్ని విప్పి చెప్పే ఉపాధ్యాయుల అవసరం ఎక్కువైంది. అందుకే అన్నారు ‘వేయి మంది పూజారు (గురువు)ల కన్నా, బాధ్యత గల ఒక ఉపాధ్యాయుడు మిన్న’ అని! పిల్లలకు ఇంగ్లీషు, జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషలు నేర్పించే దేశాల్లో ఆయా భాషల ద్వారా మత బోధలు కొనసాగించారు. వందల ఏళ్లు అదే ధోరణి నడిచింది. అదే జీవిత పరమార్థం అనుకున్నారు. తర్వాత కాలంలో తప్పని సరై గణితం, చరిత్ర, భూగోళం పిల్లలకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తున్న కొద్దీ సైన్సు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది.

గతాన్నంతా దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఈ అత్యాధునిక యుగంలో నిలబడి ఆలోచిద్దాం. ఇప్పుడు కూడా ఓ భాష నేర్చుకుని, దాంట్లోంచి మత బోధలు వంట బట్టించుకుని, మంద బుద్ధులై ఉందామా? లేక నేటి జీవితంలో ఏ ఉపయోగమూ లేని మత బోధలు పక్కన పెట్టి, ఆధునిక విజ్ఞానాన్ని ఆహ్వానిద్దామా? ఆ నాటి ఔరంగజేబు చక్రవర్తే తనకు సరైన విద్య అందించలేదని తన గురువును దోషిగా నిలబెట్టాడు కదా? మరి ఇప్పుడూ? విద్యా సంస్థల్లోనే కాదు, అనేకానేక మాధ్యమాల ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకునే వెసులుబాటు ఉంది. ఎవరి ఊర్లో వారు కుంచించుకుని ఉండిపోవాల్సిన పరిస్థితిలోంచి విశ్వమంతా నా గ్రామమే అని అనుకునే స్థాయికి ఎదిగాం. కులమతాల్ని వదిలేసి, మతేతరులుగా జీవించగలిగే స్వేచ్ఛను సంపాదించుకున్నాం. దేవుడు శిక్ష విధిస్తాడన్న భయంతో కాక స్వచ్ఛందంగా మానవీయ విలువల్ని కాపాడుకునేంతటి వివేకవంతులమయ్యాం. మరి ఇప్పుడు ప్రశ్నించుకోవాలి మూఢత్వమా? వివేకమా? బానిస మనస్తత్వమా? స్వేచ్ఛాలోచనా? పురాణాల పాండిత్యమా? వైజ్ఞానిక అవగాహనా? ఏది? ఏది మనం కావాలనుకుంటున్నాం?

“ఒక పిల్లాడు ఆపదలో ఉంటే కాపాడేవాడు మనిషి. కాపాడమని ఎవరినో ప్రార్థించేవాడు భక్తుడు. తనకేమీ సంబంధం లేదన్నట్టు ఉండేవాడు దేవుడు” మత విషయాలు బోధించి జనాన్ని ‘జ్ఞానుల్ని’ చేయాలని కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. చాలా వరకు సఫలమయ్యాయి కూడా! మతం చెప్పింది, దేవుడు చెప్పాడు వంటి బూటకపు మాటలతో తరతరాలుగా కోట్ల మందిని బానిసల్ని చేశారు. హీనజనులుగా చూసి ఈసడించారు. ప్రపంచంలో అధిక సంఖ్యాకులైన క్రిస్టియన్లు ఈ పని ఎక్కువగా చేస్తే, ఆ తరువాత వరుసలో ఉన్న ముస్లింలు, హిందువులూ కూడా ఆ పని విజయవంతంగా కొనసాగించారు. అదే ఇప్పటికీ ఇంకా ఇంకా కొనసాగాలని భావిస్తున్నారు కూడా! జ్ఞాని అయిన వాడికి అన్ని విషయాల మీద అవగాహన ఉండదు. అజ్ఞానికి మాత్రం ఉంటుంది. ఎంతటి జ్ఞాని అయినా కొన్ని కొన్ని విషయాల మీదే అవగాహన పెంచుకుంటాడు. తెలియని విషయాలు తెలియవని ఒప్పుకుంటాడు.

అదే అజ్ఞాని మాత్రం తెలియని విషయాలు తెలియవని ఒప్పుకోడు. ఇలాంటి వారు తమకు తాము బాగుపడరు. తమని బాగుపరిచే అవకాశాన్ని కూడా ఇంకొకరికి ఇవ్వరు. ఇది మతం పిచ్చలో మునిగిన అవివేకుల లక్షణం! “అభూత కల్పనలే పరమ సత్యాలని నీ చేత నమ్మించే వాళ్లు, నీ చేత పరమ క్రూర చర్యల్ని సైతం పవిత్ర కార్యాల్లాగా చేయించగలరు” అని అంటాడు వోల్టేర్ ఫ్రెంచ్ రచయిత. “మనుషులు పరస్పరం ద్వేషించుకోవడానికి తగినంత మతం అనేది ఉంది. కాని ప్రేమించుకోవడానికి చాలినంతగా లేదు” అని అంటాడు ఆంగ్లో ఐరిష్ కవి, రచయిత, జోనాథన్ స్విఫ్ట్. హిందూ కుటుంబాలలో సంస్కృతం, హిందీ, తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో కొంచెం ప్రవేశం సంపాదించి, దైవభావనని అంగీకరిస్తే చాలు. మంచి సంప్రదాయ కుటుంబం అని గుర్తింపు దొరుకుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి నాలుగు శ్లోకాలు ఎక్కువ చదివి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే సమాజం అతణ్ణి ‘గురువు’ గా గుర్తిస్తుంది. ముస్లింల పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ఖురాన్‌లో ఉన్న క్రీ.శ. 570632 నాటి విషయాలు పాటిస్తారు. మహ్మద్ ప్రవక్త చెప్పినవి అని అంటారు. అలాగే క్రిస్టియానిటీలో పాస్టర్ మాటలకు వశులైపోయి పూనకాలు పూనుతారు. కన్వరి నూనెతో రోగాలు నయమవుతాయనుకుంటారు. దేవునితో ఒక రాత్రి శృంగార దేవాలయాలు స్వస్థత ప్రార్థనలన్నీ నిజమనుకుంటారు. స్త్రీలు మోసపోతున్నారని తెలిసినా తెలివి తెచ్చుకోరు. ఈ మతాలన్నింటిలో దగ్గరి పోలికలు ఉన్నది ఎందుకంటే ఒకప్పుడు అందరూ ఒకటే కాబట్టి! భారతదేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లు చాలా వరకు ఒకప్పుడు హిందువులే.

ముస్లిం చక్రవర్తుల పాలన వల్ల, బ్రిటీష్ వారి పాలన వల్ల.. ఏవో లాభాలకు, రాయితీలకు ఆశపడి మతం మారిన వారే ఎక్కువ. బౌద్ధం ప్రభావం లోంచి బయటపడలేక, హిందువులు తమ దశావతారాలలో బుద్ధుణ్ణి కలిపేసుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో బౌద్ధారామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చుకోవడం, నిమ్నజాతుల జీవితాలు దుర్భరం చేయడం జరిగింది. ఫలితంగానే వారంతా ఇతర మతాల్ని స్వీకరించారు. తర్వాత కాలం లో హిందూ దేవాలయాల్ని కూలగొట్టి ముస్లిం రాజులు వాటిని మసీదులుగా మార్చుకున్నారు. చరిత్ర పుటల్లో మత ఘర్షణలన్నీ నమోదయ్యే ఉన్నాయి. అజ్ఞాన నేత్రంతో చూస్తే విషయాలు వంకర టింకరగా కనిపిస్తాయి. జ్ఞాన నేత్రంతో సమ్యక్ దృష్టితో చూస్తే వాస్తవాలేమిటో అర్థమవుతాయి. అయితే అధ్యయనాలన్నింటి సారాంశం ఒక్కటే “మతం మనిషిని మనిషిగా ఉండనీయదు” అని!

డాక్టర్ దేవ రాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News