Wednesday, January 22, 2025

ప్రపంచంలో దైవభావన తగ్గుతోందా?

- Advertisement -
- Advertisement -

మన దేశంలో వున్న హేతువాదులు, నిరీశ్వరవాదులు, మానవతావాదులు సంతోషించాల్సిన విషయం ఒకటుంది. “గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలిజియసిటీ” లండన్ ప్రకటన 2005 ప్రకారం… దైవ భావన, దైవ భీతితో ఉన్న వారు మన దేశంలో 87 శాతం. మళ్ళీ అదే సర్వే 2013లో జరిపినప్పుడు వచ్చిన ఫలితం 81 శాతం. అంటే సుమారు ఏడెనిమిదేళ్ళలో 6% మంది మన దేశ ప్రజలు దైవభావనలోంచి బయటపడి, ఆత్మవిశ్వాసంతో మానవతా వాదులుగా మారారన్న మాట! ఇప్పుడున్న పోప్, పీఠాధిపత్వాన్ని స్వీకరించిన తర్వాత తాజా సర్వే ప్రకారం వియత్నాంలో 23%, స్విట్జర్లాండ్‌లో 21%, దక్షిణాఫ్రికాలో 19%, అర్జెంటినాలో 8% మత విశ్వాసకులు తగ్గిపోయారు. అంటే అక్కడ హేతువాదుల సంఖ్య పెరిగినట్టే కదా? అయితే ఇందులో ఎటూ తేల్చుకోలేక తటస్థంగా వుండే వారు కూడా కొంత మంది వుండొచ్చు. ఏమైనా దైవ భీతిలోంచి బయటపడాలన్న వారి నిర్ణయం ఆహ్వానించదగిందే!
తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా వున్న పాకిస్తాన్‌లో మాత్రం ఫలితం వేరుగా వుంది. అది మనకు ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. పాకిస్తాన్‌లో మతోన్మాదు లు గతం కన్న ఇప్పుడు 6% పెరిగారు. మరో విషయమేమంటే మన పక్కనే వున్న చైనాలో తన జనాభాలో సగం మంది ఇప్పుడు నాస్తికులని తాజా సమాచారం. అంటే మన దేశంలో నిరీశ్వరవాదులు 19 శాతమైతే, చైనాలో 50 శాతమన్న మాట! ఈ లెక్కలిలా బేరీజు వేసుకోవడమెందుకంటే మన వెనకబాటుతనాన్ని మనం అంచనా వేసుకొని వైజ్ఞానిక పథంలోకి అడుగు వేయడానికి! శాస్త్ర సాంకేతిక రంగాలలో చైనా, అమెరికాతో పోటీ పడుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తోంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమంటే దేవుణ్ణీ, మత విశ్వాసాల్ని, మూఢ నమ్మకాల్ని పక్కన పెడితేనే పురోగమనం సాధ్యమని తెలుస్తోంది కదా?
2011 నాటి యుకె జనాభా లెక్కల ప్రకారం అక్కడ క్రైస్తవులు 58.8 శాతం. అయితే ఆ తరువాత స్థానం మతం లేని మానవతావాదులది! ఇక వరుసగా మిగిలిన స్థానాలన్నీ ఇతర మత విశ్వాసాలున్న వారివి. అలాగే అమెరికాలో జరిగిన సరికొత్త సర్వే ప్రకారం మత విశ్వాసాల్ని పక్కన పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అది 49 శాతం వుంది. ‘ఎందుకు మత విశ్వాసాల్ని పక్కన పెడుతున్నారూ?’ అని అడిగినప్పుడు చాలా మంది చాలా రకాలుగా సమాధానాలిచ్చారు. అయితే అన్ని సమాధానాల సారాంశం ఒక్కటే! ఇంగిత జ్ఞానం వల్ల దేవుణ్ణి నమ్మడం లేదని కొందరంటే, లాజిక్ వల్ల నమ్మడం లేదని కొందరన్నారు. ముఖ్యంగా సైన్స్ అర్థం చేసుకోవడం వల్ల, దైవ భావన పట్ల విశ్వాసం పూర్తిగా తగ్గిపోయింది అని ఎక్కువ మంది చెప్పారు. మహిమలు, అద్భుతాలు సైన్సు పరీక్షలకు నిలబడవు. అందువల్ల ఏ దేవుణ్ణి నమ్మినా ఏమీ ఫలితం వుండదు.

కేవలం మనల్ని మనం నమ్ముకుంటే చాలా అన్న అభిప్రాయం అధిక సంఖ్యాకుల్లో కనిపిస్తోంది. కుటుంబంలో వారసత్వ కారణాల వల్ల బాల్యంలో మత విశ్వాసాలు వుంటే వుండొచ్చు కాని, యవ్వన దశకు వచ్చే సరికి ఆలోచనలు మారిపోతున్నాయి. ప్రపంచాన్ని చూడడం, తోటి మనుషులతో వ్యవహరించడం, కళాశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ముఖ్యంగా జీవ పరిణామ సిద్ధాంతం పట్ల ఆకర్షితులు కావడం, దేవుడి పుట్టుకకు ఆధారాలు లేకపోవడం, దేవుడు మనుషుల్ని సంరక్షిస్తున్నాడనడానికి రుజువుల్లేకపోవడం, ప్రశ్నలూ హేతువాదమూ రంగంలోకి రాగానే మనుషుల మనసుల్లో మత విశ్వాసాలు ఇగిరిపోవడం, ఎగిరిపోవడం జరుగుతూ వస్తోందన్నది సారాంశం. ప్రపంచంలోని ఎక్కువ దేశాలలో పరిస్థితి దాదాపు ఇలాగే వుంది. అంతర్జాలంలో కావల్సినన్ని సర్వే రిపోర్టులున్నాయి. కావల్సిన వారు వెతుక్కొని విషయం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం
నిస్సందేహంగా రాబోయే కాలాల్లో పుక్కిటి పురాణాల్ని, కట్టు కథల్ని నమ్ముతూ బతికే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇంట్లో కనబడే దేవతలుగా చెప్పబడే అమ్మా నాన్నల సలహా, సంప్రదింపులు లేకుండానే స్వంత నిర్ణయాలు తీసుకొంటున్న నేటి తరం.. ఇక అసలే కనబడని, ఏ ప్రభావమూ చూపని దైవశక్తి మీద ఆధారపడతారా? సమాజం పరిపక్వ దశకు వస్తున్న కొద్దీ, జనంలో స్వయం ప్రతిపత్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు.మార్పును ఆపడం ఎవరి వల్లా కాదు. కాని, విజ్ఞానిక దృష్టికోణం లోంచి రాగల తరాల్ని మానవతావాదం వైపు మళ్ళించగలిగితే.. ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటోంది.
“ఒకరి పుట్టుకను, జాతిని ఎద్దేవా చేయడంలో హేతుబద్ధత లేదు. అది అంగీకారం కాదు. కాని, అతని మత విశ్వాసాల్ని విమర్శించే హక్కు ఇతరులకు ఉంటుం ది. అది అంగీకారమే! పుట్టిన ఏ శిశువుకూ మతం వుండదు. పుట్టిన తర్వాత చుట్టూ ఉన్నవారు దాన్ని అంటగడతారు కదా! ఈ సమాజంలో స్వేచ్ఛగా భావాల్ని వ్యక్తీకరించుకోవచ్చు. విమర్శించొచ్చు. అభినందించొచ్చు… అన్ని మాట్లాడొచ్చు కాని, మత విశ్వాసల గురించి మాట్లాడొద్దు అని నియమావళి రూపొందిస్తే అది పెద్ద పొరపాటు. ఇక ఇదేం స్వేచ్ఛ?” అని అంటా డు మిస్టర్ ‘బీన్’గా ప్రసిద్ధుడైన, సినీ రచయిత, బ్రిటీష్ రచయిత రోవన్ అట్‌కిన్ సన్.! మత వ్యతిరేక బిల్లుపై తన స్పందనను తెలియజేస్తూ
అసలైతే, భారత దేశం మూఢ నమ్మకాల విష వలయంలో చిక్కుకొని పైకి తేరుకోలేని స్థితిలో వుంది. బాబాలని, జ్యోతిష్యాలని, వాస్తులని, స్వామీజీలని నమ్మి ఈ దేశం ముందుకు నడస్తున్నాననుకుంటోంది. కష్టించి పని చేయలేని కొందరు రాసిన కొన్ని కథలని మూర్ఖంగా నమ్ముతూ, స్వతహాగా ఆలోచించే శక్తిని కోల్పోయి అజ్ఞానంతో బతకడానికి సిద్ధపడుతూ వుంది. ‘చదువురాని నిరక్షరాస్యుల కంటే చదువుకొని అజ్ఞానంతో బతుకుతున్న మూర్ఖులతోనే ఈ దేశానికి చాలా ప్రమాదం’ అని బాధ్యత గల మేధావులంతా ఆవేదన చెందుతున్నారు. జ్యోతిషం బూటకం అని నోబెల్ విజేత ప్రొఫెసర్ వెంకట్రామన్ రామకృష్ణన్ ప్రకటిస్తే, అది మన జనం చెవికెక్కదు.

ఆయనేమీ మిడిమిడి జ్ఞానంతో చెప్పిన విషయం కాదు గదా? స్ట్రక్చురల్ బయాలజీలో విశేషమైన కృషి చేసి, నోబెల్ సాధించిన మేధావి కదా? మన పిచ్చి జనం ఎలా వున్నారంటే టెన్త్‌తో, డిగ్రీయో ఫెయిలయిన వాడు చెప్పే మాటలు నమ్ముతారు. ఏదో ఆఫీసులో క్లర్కుగా పని చేసి, రిటైరయ్యాక ప్రవచనాలు చెప్పుకు తిరిగే వాణ్ణి నమ్ముతారు. భక్తి ముసుగులో వాళ్ళు మూఢత్వం ప్రచారం చేస్తున్నారన్న విషయం గ్రహించరు. ప్రొఫెసర్ వెంకట్రామన్ రామకృష్ణన్ ఒక ప్రకటనలో ఏం చెప్పారంటే “వివిధ రకాల భావ దారిద్య్రాలతో మగ్గుతున్న ప్రజలను మంచి పాలనా వ్యవస్థ గల ప్రభుత్వాలు మాత్రమే రక్షించగలవని, సంకుచితత్వం, అశాస్త్రీయ భావనల్లోంచి మనిషిని రక్షించే క్రమ పరిణామమే వైజ్ఞానిక శాస్త్రమని.. అది కాల పరీక్షలకు తట్టుకొని నిలబడిందని” అభివర్ణించారు.
ప్రస్తుతం కేంబ్రిడ్జి యూనివర్శిటీ, బ్రిటన్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్ వెంకట్రామన్ రామకృష్ణన్ “జ్యోతిషం, రసవాదం వాస్తు శాస్త్రాలు ఎంత మాత్రమూ భారతీయ జ్ఞాన సంపద కావు” అని కొట్టి పారేశారు. ‘విశ్వాసాలు జనాన్ని విడదీస్తాయి. ప్రశ్నలు కలుపుతాయి” అని అన్నారు సర్ పీటర్ అలెగ్జాండర్ ఉత్సినోవ్. బ్రిటీష్ రచయిత, నటుడు, దర్శకుడు. అలాంటి భావనలతోనే కాబోలు విశ్వ జనుల్లో చాలా మంది మత విశ్వాసాల్లోంచి బయటపడి స్వేచ్ఛాలోచన వైపు దృష్టి మరలుస్తున్నారు. మన దేశ గణాంకాల ప్రకారం నిరీశ్వరవాదుల లెక్కలేవీ వుండవు. కాని 2015లో విడుదలైన 2011 నాటి గణాంకాలు ప్రకారం మన దేశంలో మూడు కోట్ల మంది తమకు ‘మతం లేదు’ అని ప్రకటించిన వారున్నారు. అంటే ఇందులో హేతువాదులు, నాస్తికులు, మానవతావాదులు ఉన్నట్టే కదా? కొద్దిపాటి తేడాలున్నప్పటికీ స్థూలంగా వీరంతా ఒక్కటే! ద్రవిడార్‌కజమ్ రాజకీయ పార్టీ నాయకుడు కె. వీరమణి చెప్పిన ప్రకారం, మతం లేదన్న ప్రజల గణాంకాలు తొలిసారి వెల్లడయ్యాయి.

అయితే నిజానికి ఈ సంఖ్య చాలా ఎక్కు వ వుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కారణం ఏమిటంటే చాలా మంది మతం గురించి మాట్లాడితే తమ గురించి తోటి వారు శత్రు భావన పెంచుకుంటారేమో మతం లేదంటే తమని తక్కువగా చూస్తారేమో నిరీశ్వరవాదులమని చెప్పుకుంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే.. అనుమానాలతో, భయాలతో, తమ అభిప్రాయం, ఉద్దేశం ధైర్యం గా, స్వేచ్ఛగా చెప్పుకోరు. ఏదో ‘నలుగురితో నారాయణ’ లాగా పోతే సరి ‘ఎందుకు లేనిపోని గోడవలు?’ అనుకొనే పిరికి మనస్తత్వం గలవారు మతం మీద తమ స్పష్టమైన వైఖరేదో వ్యక్తీకరించరు అన్నది కొందరు మనస్తత్వ శాస్త్రజ్ఞులు వెలిబుచ్చిన అభిప్రాయం! 2006లో డెంట్యూ కమ్యూనికేషన్ ఇన్‌స్టిట్యూట్, జపాన్ పరిశోధనా కేంద్రం జరిపిన వరల్డ్ వాల్యూ సర్వే ప్రకారం 6.6 శాతం భారతీయులు తమకు మతం లేదని ప్రకటించుకొన్నారు.

విన్ గాలప్ గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలిజియన్ అండ్ ఎథీజమ్ ప్రకారం భారత్‌లో మత విశ్వాసం లేని వారి శాతం 13 శాతానికి పెరిగింది. మనం పైన విశ్లేషించుకొన్న విలువలే దాదాపు ఇతర సర్వేలు వెల్లడించాయి. వేరు వేరు సంస్థలు వేరు వేరు సర్వేలు నిర్వహించొచ్చు. వాటి ఫలితాలు కొంచెం అటు, ఇటుగా కూడా వుండొచ్చు. కాని స్థూలంగా మనం చూడవల్సిందేమంటే ఫలితాలు ఏం చెపుతున్నాయన్నదే ముఖ్యం!అంతర్గతంగా సమాజంలో ఏ భావన ప్రవహిస్తోంది అన్నదే ముఖ్యం!! సమాజంలో వైజ్ఞానిక స్పృహ పెరుగుతున్న కొద్దీ, మత విశ్వాసాలు తగ్గు ముఖం పడుతున్నాయి. దైవ భీతి లోంచి జనం విముక్తులవుతున్నారు అన్నది సారాంశం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News