నిర్వాహకులపై పోలీసుల కేసు నమోదు
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో కరోనా వైరస్ నిబంధనలకు వ్యతిరేకంగా మతపరమైన ఊరేగింపు నిర్వహించినందుకు ఆ కార్యక్రమ నిర్వాహకులు ఇద్దరితోపాటు ఒక డిస్క్ జాకీ(డిజె)పై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం పట్ది పట్టణంలో నిర్వహించిన మతపరమైన ఊరేగింపులో దాదాపు 150 మంది భక్తులు పాల్గొన్నారని అధికారులు తెలిపారు. మొదట ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు అనంతరం భక్తులతో పట్టణ వీధులలో ఊరేగింపు నిర్వహించారని వారు చెప్పారు. డిజె పెట్టిన పాటలకు, సంగీతానికి భక్తులు వీధులలో నాట్యం చేశారని, సామాజిక దూరం వంటి నిబంధనలను పాటించకపోవడంతోపాటు ఎవరూ మాస్కులు కూడా ధరించలేదని అధికారులు చెప్పారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడడంపై ఆంక్షలు విధిస్తూ సురేంద్రనగర్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో భక్తులతో ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు.