కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
నాగపూర్: కొవిడ్-19 రోగులకు అందచేసే చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ఉత్పత్తిని జెనెటెక్ లైఫ్‌సైన్సెస్ సంస్థ మహారాష్ట్రలోని వార్ధాలో బుధవారం నుంచి ప్రారంభించనున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వెల్లడించారు. నాగపూర్‌లో మంగళవారం ఒక కొవిడ్-కేర్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోజుకు 30 వేల వయల్స్‌ను ఆ కంపెనీ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.
కొవిడ్ నిర్ధారణ అయి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర పరిస్థితులలో రెమ్‌డెసివిర్ వాడేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వార్ధాకు చెందిన జెనెటెక్ లైఫ్‌సైన్సెస్ సంస్థ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఉత్పత్తి చేసేందుకు తాత్కాలిక లైసెన్సు లభించింది. హైదరాబాద్‌కు చెందిన నిపుణుల బృందం వార్ధా చేరుకుని ప్రయోగ పరీక్షలు జరుపుతోంది. బుధవారం నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గడ్కరీ తెలిపారు. ఉత్పత్తి అయిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను నాగపూర్‌తోపాటు విదర్భ ప్రాంతానికి చెందిన ఇతర జిల్లాలకు పంపిణీ చేస్తారని తెలుస్తోందతి. అవసరం మేరకు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు కూడా పంపిణీ చేయనున్నట్లు సమాచారం.