Tuesday, January 21, 2025

అమరవీరుల త్యాగాలు స్మరించుకోడానికే సంస్మరణ దినోత్సవం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించుకోవడానికే తెలంగాణ సంస్మరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంస్మరణ సభ ప్రారంభానికి ముందుగా అమరవీరులకు శ్రద్ధ్దాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలను గౌరవించుకోవడం కార్యక్రమం చేపట్టామన్నారు.

జిల్లాలోని అన్ని స్థానిక సంస్థలు, అయిన గ్రామ, మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అమరవీరులను కచ్చితంగా సన్మానించుకోవాలని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని కలెక్టర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలో 32 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నాని, వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున నగదు అందించామని, 30 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. మరో ఇద్దరి కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నామని తెలిపారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వివిధశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించామన్నారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ తెలంగాన ఉద్యమంలో అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని దశాబ్ధి ఉత్సవాల్లో వివరించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని, అయితే ముగింపు దినోత్సవాన్ని మాత్రం తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయిందనే బాధతో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నారని అన్నారు. నిజామాబాద్ నగరంలో 8 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని తెలిపారు. వారి త్యాగం మరువలేనిదని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ 10లక్షల నగదు అందజేసి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందన్నారు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న జాతీయ జెండా ఆవిష్కరించిన రోజు అమరుల కుటుంబాలను సన్మానించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచనతో అమరవీరులకు హైదరాబాద్‌లో సెక్రెటేరియట్ ఎదుట బ్రహ్మాండమైన స్ఫూపం నిర్మించడం జరిగిందన్నారు. సెక్రెటేరియట్‌లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆ స్థూపాన్ని చేస్తూ తెలంగాణా అభివృద్ధి కోసం పని చేయాలనే తపన ఉంటుందనే ఆశయంతో నిర్మించారని అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి స్థూపం లేదన్నారు. తెలంగాణ సంస్మరణ దినోత్సవానికి సంపూర్ణత చేకూరిందని నగర మేయర్ దండూ నీతూ కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ఛైర్మన్ రజిత యాదవ్, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు, అమరవీరుల కుటుంబీకులు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News