ఖమ్మం : యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మాదకద్రవ్యాల వైపు ఆలోచన వస్తే మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ పట్ల ఆకర్షితులు కావొద్దని జిల్లా మహిళా శిశు,బిసి సంక్షేమ అధికారిణి జి.జ్యోతి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా సంక్షేమ అధికారిణి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నాగేందర్ రెడ్డి, జిల్లా డ్రగ్స్ అధికారి ప్రసాద్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, గ్యాస్ట్రో వైద్యులు జంగాల సునీల్ కుమార్లతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం స్థానిక లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, సమాజంలో యువత మంచి, చెడు తెలుసుకుని క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి గొప్ప స్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుందన్నారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. యువత డ్రగ్స్‌తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా విధానం ఆలోచన శక్తి నశిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను గ్యాస్ట్రో వైద్యులు జంగాల అనీల్ కుమార్ వివరించారు. మాదక ద్రవ్యాల రవాణా, సేవనం పట్టుబడితే శిక్షణ గురించి పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఇట్టి విషయమై సమాచారం పోలీస్ వారికి అందించాలని, వారిని సన్మార్గంలో పెట్టేందుకు సహకరించాలని వారు కోరారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణ, డ్రగ్స్ నివారణ కోసం రూపొందించిన పోస్టర్లను, బ్రోచర్లను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావు, అధికారులు, కోచ్ మూర్తి, యువతి యువకులు పాల్గొన్నారు.