Sunday, December 22, 2024

రిమోట్ ఓటింగ్ సాధ్యాసాధ్యాలు

- Advertisement -
- Advertisement -

2014 నాటి రాజకీయ స్థితిని అధికార, ప్రతి, ప్రత్యామ్నాయ పక్షాలు సరిగా విశ్లేషించుకో లేదు. భవిష్యత్తు రాజకీయ స్థితిని అంచనా వేయలేదు. 2014 ఎన్నికల తర్వాత ఓటేయని వారి గురించి ఆలోచించసాగాయి. ఓటు నమోదు చేసుకున్న ప్రాంత పోలింగ్ బూత్ నుండి కాక నియోజక వర్గంలో లేదా రాష్ట్రంలో లేదా రాష్ర్టే తర ప్రాంతంలోని ఇతర పోలింగ్ బూత్ నుండి ఓటేసే సౌకర్యాన్ని రిమోటింగ్ ఓటింగ్ అంటారు. ఇందుకు ఎన్నికల సంఘం (ఇసి)రిమోట్ ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఆర్‌ఇవిఎం) ప్రతిపాదించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 37%, 45.36 కోట్ల వలస ఓటర్లున్నారు. వీరిలో 27.8 కోట్లు గ్రామీణులు. 17.56 కోట్లు పట్టణవాసులు. 30.96 కోట్లు స్త్రీలు. 14.4 కోట్లుమగవారు. 2019 సాధారణ ఎన్నికల్లో 91.2 కోట్ల ఓటర్లలో 67.4% మందే ఓటేశారు. 32.6% అనగా 30 కోట్ల మంది ఓటేయలేదు. ఇది అమెరికా జనాభాతో సమానం. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్ వగైరా రాష్ట్రాల నుండి వలస కూలీలు ఎక్కువ. 2019 ఎన్నికల్లో బీహార్‌లో 57.33%, ఉత్తరప్రదేశ్‌లో 59.21% మందే ఓటేశారు. ఇది జాతీయ ఓటు శాతం 67.4 కంటే తక్కువ.

పట్టణవాసులు ఓటేయడానికి సుముఖంగా ఉండరు. యువతకు ఓటింగ్ పట్ల ఉదాసీనత. వలసదార్లకు తామున్న స్థలంలో ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం లేదు. వలసలకు 4 కారణాలు. యువకులు చదువు కోసం స్వస్థలాలు వదిలి వెళతారు. స్త్రీలు పెళ్లి తర్వాత పుట్టినిల్లు వదులుతారు. చదువరులు ఉద్యోగం కోసం, కూలీలు బతుకుదెరువు కోసం వలసపోతారు. గ్రామాల నుండి వలసలు ఎక్కువ. 85% వలసలు రాష్ట్రం లోపలే జరుగుతాయి. పని స్థలం మారిన ప్రతిసారీ వలస కార్మికులు కొత్త ప్రదేశంలో ఓటు నమోదు చేసుకోలేరు. అంతేగాక సొంత ఊరిలో ఓటును రద్దు చేసుకోడానికి ఇష్టపడరు. దూర ప్రాంతాలవారు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటేయవచ్చు. ఈ సౌకర్యం సైనికులకు, విదేశాల్లోని ప్రభుత్వోద్యోగులకు, దౌత్య సిబ్బందికి, దేశంలో అత్యవసర సేవల్లో ఉన్నవారికి, 80 ఏళ్లు దాటిన వోటర్లకు, కొవిడ్ రోగులకు మాత్రమే వర్తిస్తుంది. వలసదారుల ఓటు హక్కు రక్షణకు సురక్షిత సుదూర ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టించమని కేరళకు చెందిన కె. సత్యన్ సుప్రీంకోర్టును కోరారు. రిమోట్ ఓటింగ్ అవకాశాలను పరిశీలించమని సుప్రీంకోర్టు 2015లో ఇసిని ఆదేశించింది.

2 మార్గాల భౌతిక రవాణా పోస్టల్ బ్యాలట్, ప్రాతినిధ్య ఓటింగ్, ప్రత్యేక ముందస్తు ఓటింగ్ కేంద్రాల్లో ముందస్తు ఓటింగ్, ఏక మార్గ /2 మార్గాల ఎలెక్ట్రానిక్ ప్రసార పోస్టల్ బ్యాలట్, అంతర్జాల ఓటింగ్ వంటి పద్ధతులను పరిశీలించిన ఇసిఆర్ ఇవిఎంలు అభివృద్ధి పరిచింది. వలసదారులు రిమోట్ ఓటింగ్‌ను నమోదు చేసుకోవాలి. వారి ఓటును నమోదిత ఓటు రికార్డుతో ధ్రువీకరిస్తారు. తగిన సంఖ్య లో అభ్యర్థులుంటే రిమోటింగ్ ఓటింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తారు. కోర్టు ఆదేశించిన 8 ఏళ్ళకు 16 జనవరి 2023న 8 జాతీయ, 57 ప్రాంతీయ పార్టీలకు ఆర్‌విఎంల ప్రదర్శనను ఇసి ప్రతిపాదించింది. ఈ సమావేశానికి హాజరైన 8 జాతీయ, 40 ప్రాంతీయ పార్టీలకు చెందిన 80 మంది మరింత చర్చ కోరారు. ఆర్‌విఎంల పని తీరును ప్రదర్శించ లేదు. ప్రతిపక్షాల లిఖిత అభిప్రాయాల గడువును 31 జనవరి 2023 నుండి 28 ఫిబ్రవరి 2023కు పెంచారు.

రిమోట్ ఓటింగ్ ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని తొలగిస్తుందని గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ 15 జనవరి 2023 న ప్రతిపక్షాలను సమావేశపర్చింది. సమాజ్‌వాది, నేషనల్ కాంగ్రెస్, తృణాముల్ కాంగ్రెస్, ఆప్‌లు లేని ఆ సమావేశం ఆర్‌విఎంల ఉపయోగం అసంపూర్ణంగా, గందరగోళంగా ఉందని వాటిని వ్యతిరేకించింది. పని తీరును చూడకనే ఇలా వ్యాఖ్యానించడం సబబా? ఆర్‌విఎంలు ఇవిఎంల కొనసాగింపే ఆర్‌విఎంల ప్రవేశంలో కేంద్ర పాలకపక్ష కుయుక్తి ఉండవచ్చు. పాలక పక్ష నిరంకుశత్వ నిలువరింపుకు జరుగుతున్న ప్రయోగాలు, ప్రజలు ఈ కుయుక్తులను తిప్పికొట్టగలవు.

1989లో ఇవిఎంలను తయారు చేసిన ప్రభుత్వరంగ సంస్థలు బెంగళూరు భారత ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్), హైదరాబాదు ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐఎల్) రిమోట్ ఇవిఎంలను అభివృద్ధి చేశాయి. 2006- 10లలో తయారైన మార్క్ 2 ఇవిఎంలు ఒక కంట్రోల్ యూనిట్ ఒక్కొక్కటి 16 మందితో 4 బ్యాలట్ యూనిట్లతో 64 మంది అభ్యర్థులకు స్థానంకల్పిస్తాయి. 2013లో తయారైన మార్క్ 3 ఇవిఎంలో 24 బ్యాలట్ యూనిట్లతో 384 అభ్యర్థులకు అవకాశముంది. ఆర్ విఎంలు ఒక రిమోట్ పోలింగ్ బూత్ నుండి 72 నియోజక వర్గాలను అనుసంధానిస్తాయి. ఒక ఇవిఎంలో 2000 ఓట్లు నమోదవుతాయి. మార్క్ 2 ఇవిఎం ఖరీదు రూ. 8,670లు. మార్క్ 3 ఇవిఎం ఖరీదు రూ. 17వేలు. ఓట్ల నమోదుకు ముందు అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజల్ట్ బటన్ నొక్కి ముందుగా ఓట్లు నమోదు కాలేదని ధ్రువీకరిస్తారు. నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఓటింగ్ సరళిని గుర్తించకుండా ఓట్ల లెక్కింపుకు ముందు 14 ఇవిఎంలలో నమోదైన ఓట్లను కలగలిపే టోటలైజర్ ఏర్పాటు ఉంది. ఫలితాల్లో తలెత్త గల గొడవలన్నీ సమసిన తర్వాత డిలిట్ చేస్తేనే ఇవిఎంలో నమోదైన ఓట్లు రద్దవుతాయి. ఇవిఎంల జీవిత కాలం 15 ఏళ్లు. వాటి జీవిత కాలం వరకు నమోదైన ఓట్లను చెరపకుండా ఉంచవచ్చు.

రిమోట్ ఓటింగ్ అమలుకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951 లను, ఎన్నికల నిర్వహణ నియమాలు 1960 లను, ఓటర్ల నమోదు నియమాలు 1961 లను సవరించాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 19 ప్రకారం ఓటరు తాను నివసించే నియోజకవర్గంలోనే ఓటు నమోదు చేసుకోవాలి. పోలింగ్ బూత్‌లో వ్యక్తిగతంగా ఓటేయాలి. రిమోట్ ఓటింగ్ సామాజిక మార్పుకు దారితీయగలదు. దానితో ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఓట్లను కొనే, ఓటర్లను ప్రలోభపెట్టే, భయభ్రాంతులకు గురిచేసే అవకాశాలు తగ్గవచ్చు. పీడిత వలస జీవులకు, అందులో అధిక సంఖ్యలోని ఆడువారికి ఓటేసే అవకాశం లభిస్తుంది. వారి అసంతృప్తులు ఓటింగ్‌లో ప్రతిబింబిస్తాయి. మనం 4 ప్రజాస్వామ్య స్తంభాల గురించే మాట్లాడతాం. అసలైన, అతి ప్రధానమైన ఐదవ స్తంభం ప్రజాభిప్రాయం. ఉత్పత్తి సాధనాలు తమవి కాకపోయినా జాతీయోత్పత్తికి పాటుబడుతున్న వలస జీవులు, విద్యార్థులు, యువకులు, స్త్రీలు అసలయిన ప్రజలు. వారి అభిప్రాయం ఈ రిమోట్ ఓటింగ్ పద్ధతిలో ప్రతిబింబిస్తుంది.

ఆర్‌ఇవిఎంలను ప్రవేశపెట్టే ముందు ఇవిఎంలపైనున్న అనుమానాలను ఎన్నికల సంఘం తీర్చాలి. లోపాలను సరిచేయాలి. ఓటింగ్‌లో నూరు శాతం రహస్యత లోపించింది. ఇది రాజ్యాంగ అధికరణ 324 ను, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 128 ను ఉల్లంఘిస్తోంది. తప్పుగా నమోదైన ఓటును సరిదిద్దే సౌకర్యం వివిపాట్ పద్ధతిలో లేదు. ఎన్నికల ఫలితాలపై నూరు శాతం ఎన్నికల అనంతర తనిఖీ జరగాలి. తర్వాతే ఫలితాలను ధ్రువీకరించాలి. ఇవేమీ జరగకుండానే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో 347 నియోజకవర్గాల్లో తేడాలు బయటపడ్డాయి. ఈ తేడాలు 1,01,323 వోట్ల వరకు ఉన్నాయి. పోలైన వోట్లలో 7,39,104 వోట్లతో ఈ తేడా 10.49%. 6 నియోజకవర్గాల్లో గెలుపు ఆధిక్యత కంటే ఓట్ల తేడా ఎక్కువ. ఇవి నేటికీ పరిష్కారం కాలేదు. రాజ్యాంగ అధికరణ 324 ప్రకారం ఎన్నికల పర్యవేక్షణ, ఆదేశాలు, సూచనలు, నియంత్రణ ఎన్నికల సంఘానికి ఉండాలి. ఓటింగ్ మెషిన్లను తయారు చేసే బిఇఎల్, ఇసిఐఎల్ సంస్థలపై ఎన్నికల సంఘానికి నియంత్రణ లేదు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై వచ్చిన సమాచార హక్కు చట్ట ప్రశ్నలపై ఎన్నికల సంఘం నిశ్శబ్దం పాటిస్తోంది.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News