- మన ఊరు మనబడి పాఠశాలల నిర్మాణపు పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చర్యలు
- అధికారులు మనసుపెట్టి పని చేయాలి
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదు
- టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం
వికారాబాద్ : మన ఊరు మనబడి పాఠశాలల నిర్మాణపు పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టిఎస్ ఈడబ్ల్యూఐడీసీ తాండూరు అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. గురువారం టెలి టెలికాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు మనబడి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరుమనబడి పనులలో జిల్లా వెనుకబడి ఉందని, నిధుల కొరత లేనప్పటికీ పనుల సక్రమంగా జరగడం లేదన్నారు.
అధికారులు మనసుపెట్టి పని చేయాలని, ఏమైన సమస్యలు ఉంటే వాటిని అధిగమించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. మన ఊరుమనబడి పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాండూరు టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఏఈ శ్రీనివాస్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరుమనబడి పనులలో ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొన్ని మండలాలలో ఇంకా పనులు ప్రారంభం కాలేదని, అన్ని పనులను వెంటనే ప్రారంభించి జులై 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎఫ్టిఓలు అప్లోడ్ చేస్తే డబ్బులు వెంటనే చెల్లించడం జరుగుతుంద అన్నారు. ఇక ప్రతి వారం మన ఊరుమనబడి పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. జిల్లాకు కొత్తగా 269 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులను సోమవారం వరకు గ్రౌండింగ్ పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
అలాగే ఇంజినీరింగ్ అధికారులకు ఎన్నికల విధులలో భాగంగా సెక్టర్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అవసరమైన శిక్షణ తరగతులు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారిని రేణుకాదేవి, వివిధ ఇంజినీరింగ్ శాఖల ఏఈలు, డీఈలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.