ఉప్పల్: నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ నిర్వాహకులపై వాహనదారులు తిరగబడ్డారు. ఫ్రీ పార్కింగ్ స్థలంలో పెయిడ్ పార్కింగ్ పెట్టడంతో వాహనదారులలో గందరగోళంలో పడ్డారు. పెయిడ్ డబ్బులు కూడా పార్క్ హైదరాబాద్ అనే యాప్ నుంచి కట్టమని కండీషన్ పెట్టారు. కానీ ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కాకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఆఫీసులకు టైమ్ అయిపోవడం, ఫ్రీ పార్కింగ్ తీసేయడంతో నిర్వాహకులతో వాహనదారులు గొడవకు దిగారు.
నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ధరలు నిర్ణయించారు. బైకులు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే పది రూపాయలు అని, 8 గంటల వరకు రూ.25లు అని, 12 గంటల వరకు రూ.40 చెల్లించాలని బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30లు అని, 8 గంటల వరకు రూ.75లు అని, 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించి బోర్డు ఏర్పాటు చేశారు.