యుపి మంత్రి సంజయ్ నిషద్ పిలుపు
బాగ్‌పట్(యుపి): ఆలయాల సమీపంలో ఉన్న అన్ని మసీదులను తొలగించాలని ఉత్తర్ ప్రదేశ్ మత్స శాఖ మంత్రి సంజయ్ నిషద్ పిలుపునిచ్చారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం వ్యాపిస్తోందని, ఆలయాల సమీపంలో ఉన్న మసీదులను తొలగించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మదర్సాల సర్వేను ప్రస్తావిస్తూ మదర్సాలకు ఉగ్రవాదంతో సంబంధం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, అనేక సార్లు మదర్సాలలో ఉగ్రవాదులను పట్టుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. తమపైన ఏర్పడిన ముద్రను చెరిపివేసుకోవడానికి ముస్లిం మత నాయకులు కూడా మదర్సాల సర్వేకు ఒప్పుకోవాలని ఆయన కోరారు. దేశంలో మతోన్మాద వ్యాప్తికి ప్రతిపక్షాలు కారణమని ఆయన ఆరోపించారు. మౌలానాలతోకుమ్మక్కై ప్రతిపక్షాలు మత ఘర్షణలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో యోగి ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత ఘర్షణలు పూర్తిగా తగ్గిపోయాయని ఆయన అన్నారు.