ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) ఆనుకొని పుప్పాలగూడ దగ్గర ట్రాఫిక్ జాం కావడం, వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు కొంతమేర సైకిల్‌ట్రాక్ రూఫ్‌ను తొలగించారు. ప్రస్తుతం ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతుండడంతో సైకిల్ ట్రాక్‌ను జేసిబి సాయంతో అధికారులు కొంతమేర తీసివేశారు. నానక్‌రామ్‌గూడ వద్ద డౌన్ ర్యాంప్ 2, అప్‌రాంప్‌లు 2 నిర్మించి ఇంటర్‌చేంజ్ అనుసంధానించాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు కూడా హెచ్‌ఎండిఏకు నివేదిక ఇవ్వడంతో ర్యాంప్‌లను నిర్మాణానికి హెచ్‌ఎండిఏ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే 80మీల ప్రతిపాదిత ర్యాంప్ నిర్మాణం కోసం సైకిల్‌ట్రాక్ రూఫ్ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు.
హైదరాబాద్ టు నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర…
హైదరాబాద్ టు నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్‌ను 2023 అక్టోబర్ 1న అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. హెచ్‌ఎండిఏ నిర్మిచిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలో మొదటిది కావడం విశేషం. నానక్ రామ్‌గూడ నుంచి టిఎస్పీఏ వరకు 9 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు మేర మూడు లేన్‌లతో సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. 4.5 మీటర్స్ వెడల్పు ట్రాక్, ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్, 21 కిలోమీటర్ల సోలార్ రూఫ్ తో పాటు లైట్‌లను ఏర్పాటు చేశారు.సైక్లిస్ట్‌ల కోసం పార్కింగ్, టాయిలెట్స్‌లను సైతం ఏర్పాటు చేశారు.
23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్‌లో 21 కిలోమీటర్లు సోలార్ రూఫ్ టాప్ మరో రెండు కిలోమీటర్లు నాన్ సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల 16 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఒక మెగావాట్ సోలార్ పవర్‌ను సైకిల్ ట్రాక్ కోసం ఉపయోగించనున్నారు. మిగతా 15 మెగావాట్ల విద్యుత్‌ను ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న విద్యుత్ దీపాలకు హెచ్‌ఎండిఏ ఉపయోగించనుంది. ఈ ట్రాక్ 24 గంటలు అందుబాటులో ఉండనుంది. ట్రాక్ చుట్టూ సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్ ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.