Thursday, January 23, 2025

ఇండియా ఇక భారత్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెల 9న జి 20 విందు సమావేశానికి పంపిన ఆహ్వాన పత్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసుకోవడంపై మంగళవారం రాజకీయ దుమారం చెలరేగింది. ఈనెలలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టనున్నట్లు కాంగ్రెస అనుమానం వ్యక్తం చేయగా జాతీయ గౌరవానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందంటూ బిజెపి ప్రశ్నించింది.
కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి పట్ల ఆందోళన చెందుతున్న బిజెపి దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
వెల్‌కమ్ ది రిపబ్లిక్ ఆఫ్ భారత్ అంటూ ఎక్స్‌లో(ఇదివరకటి ట్విట్టర్) అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ పెట్టిన పోస్టుతో ఇండియా పేరును భారత్‌గా మార్చే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం ఏర్పడింది. దీనికి కొనసాగింపుగా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మరో పోస్టు పెడుతూ..దేశ గౌరవానికి, ప్రతిష్టకు సంబంధించిన ప్రతి అంశంపై కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు. భారత్ జోడో పేరిట రాజకీయ యాత్రలు జరుపుతారు కాని భారత్ మాతా కీ జై అంటే మాత్రం ద్వేషిస్తారు. కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల కాని రాజ్యాంగం పట్ల కాని, రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాని ఏమాత్రం గౌరవం లేదని స్పష్టమవుతోంది. వారికి ఒకే ఒక కుటుంబాన్ని కీర్తించడం మాత్రమే తెలుసు. కాంగ్రెస్ పార్టీ జాతి వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాలు యావద్దేశానికి తెలుసు అంటూ నడ్డా తన పోస్టులో విమర్శించారు.
కాగా..అంతకు ముందు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ సెప్టెంబర్ 9న జి20 విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వాన పత్రంలో సాధారణంగా వ్యవహరించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారని తెలిపారు. ఇక రాజ్యాంగంలోని 1వ అధికరణను ఇలా చదవవచ్చు: భారత్, ఒకప్పటి ఇండియా రాష్ట్రాల సమాఖ్య. ఇక ఇప్పుడు రాష్ట్రాల సమాఖ్యపై కూడా దాడి జరుగుతుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఇండియా పదాన్ని భారత్‌గా మార్చడానికి రాజ్యాంగ సవరణ కోరవచ్చు అంటూ జైరాం రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రను వక్రీకరించడడం, రాష్ట్రాల సమాఖ్య అయిన ఇండియాను ఇక నుంచి భారత్‌ను చీల్చవచ్చు..కాని మమల్ని మాత్రం అడ్డుకోలేరు అంటూ జైరాం వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News