దక్షిణమధ్య రైల్వే జిఎం గజానన్ మాల్య
హైదరాబాద్: వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సంస్థ మళ్లీ సాధారణ రైళ్లను పునరుద్ధరించడానికి రెడీ అవుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మౌలాలి నుంచి సనత్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 55 ఎంఎంటిఎస్ లోకల్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలోనే మరో 30 సర్వీసులను పునఃప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అయితే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మరోసారి సూచించారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోలన్నారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి నేపథ్యంలో రైల్వేస్టేషన్లు, రైళ్లలో కోవిడ్ ప్రొటోకాల్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు