Sunday, December 22, 2024

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంక , గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు అమెరికాలో అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

స్టాటిస్టిక్స్‌లో నోబెల్ అంతటి గౌరవం…
సీఆర్ రావు 78 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గాను ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డు వరించింది. 102 ఏళ్ల వయసులో ఈ ఏడాదే ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో కోల్‌కతా మేథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆయన చేసిన కృషి , ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

బాల్యమంతా ఏపీ లోనే …
సీఆర్ రావు 1920 సెప్టెంబర్ 10న బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ గణితం చేసిన ఆయన యూనివర్శిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఎ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోని కింగ్స్ కాలేజీలో 1948 లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన 2020 సెప్టెంబర్ 10న వందో పుట్టిన రోజు జరుపుకొన్నారు.

ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన , యూనివర్శిటీ ఆఫ్ బఫెలో లో రీసెర్చి ప్రొఫెసర్‌గా సేవలందించారు. హైదరాబాద్ లోని సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, వ్యవస్థాపకులైన ఆయన సేవలు కేవలం స్టాటిస్టికల్ రంగానికే కాకుండా ఎకనమిక్స్, జెనెటిక్స్, ఆంత్రోపాలజీ, తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్టు ఇటీవల వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న ఆయన ఇప్పటివరకు 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు.

2002లో అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ మ్యాథమెటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఎన్‌ఎస్ భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

సిఆర్ రావు పరిశోధనలివే…
సీఆర్ రావు తన పరిశోధనల్లో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్‌ను భారీగా వాడడానికి ఉపయోగపడ్డాయి. ఈ మూడింటిలో మొదటిది , క్రామెర్ రావు లోయర్ బౌండ్. ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తమ విధానాన్ని సూచించింది. రెండవది రావుబ్లాక్‌వెల్ సిద్ధాంతం. ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది. మూడోది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అభివృద్ధి. ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్ధంగా సేకరించేందుకు సహాయ పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News