Friday, December 27, 2024

ఖమ్మంలో పోటీ చేసే హక్కు నాకే ఉంది..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని, అయితే తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తారంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని ఖమ్మం మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తెలిపారు. కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపి స్థానం నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఖమ్మం వచ్చి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కోరుతుందన్నారు. అయితే ఆమె ఖమ్మం నుంచి పోటీ చేస్తే తొలుత సంతోషించేది తానేనని పేర్కొన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నిర్ణయమే శిరోధార్యమని , ఆమె నిర్ణయం వెలువడే వరకు ఎవరూ అభ్యర్థి కారని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాగాంధీ, లేదా ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుందని అన్నారు.అయోధ్యలో రాముడిని బిజెపి రాజకీయం కోసం వాడుకుంటోందని విమర్శించారు. దేవాలయం పూర్తి కాకుండా ప్రతిష్ఠ చేస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు. ప్రధాని మోదీ మూర్ఖంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రామాలయ నిర్మాణాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది సిగ్గుచేటు అన్నారు. భద్రాచలం రామయ్యను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన సీతారాములు భద్రాచలంలో ఉన్నారని.

శ్రీరాముడి గౌరవాన్ని బ్యాలెట్ బాక్స్ స్థాయికి దించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల నోటిఫికేషను ముందు గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ సరికాదని అనేకమంది ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారని, తన అభిప్రాయం కూడా అదేనని అన్నారు. భద్రాద్రి రామాలయ సమస్యలు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, రాబోయే 20 ఏళ్లపాటు సిఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని జోస్యం చెప్పారు. బస్సుల్లో ఇప్పుడు మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా ప్రయాణిస్తున్నారని, తాను కూడా భవిష్యత్‌లో బస్సుల్లో ప్రయాణిస్తానని పేర్కొన్నారు.

నా జోస్యం నిజమైంది

గతంలో ఖమ్మంలో మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతారని తాను గతంలోనే చెప్పానని తాను చెప్పినట్లుగానే ఖమ్మంలో అజయ్ రాజకీయం ముగిసిందన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ తాగుతున్నది తమ మోచేయి నీళ్లు.. ఖమ్మంలో గత పాలకుల అండతో జరిగిన కబ్జాలన్నింటినీ తిరిగి వెనక్కి రప్పిస్తామని అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే ఉంటాయని చెప్పారు. ఖమ్మంలో ఇప్పుడు స్వేచ్ఛపూరిత వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ప్రజలు మనోధైర్యంతో జీవిస్తున్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు,

చెక్కుచెదరని కత్తులు.. వారికి న్యాయం జరగాలి.. అప్పటివరకు వారితోనే ఉండి వారి కోసం పని చేస్తానని రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో కబ్జాలకు గురైన స్థలాలను తాను పరిశీలించేందుకే వచ్చానని అన్నారు. ఖమ్మం ఖిల్లా అభివృద్ధిలో భాగంగా సౌండ్ అండ్ లైట్నింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించానని, ఆ నిధులు ఆ తర్వాత ఏమయ్యాయో అర్థం కాలేదు అన్నారు. ఆ నిధులకు సంబంధించి ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధా కిషోర్, దీపక్ చౌదరి, కొరివి వెంకటరత్నం, కట్ల రంగారావు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News