Monday, January 20, 2025

రేణుకా స్వామి శరీరంపై 15 గాయాలు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు దర్శన్, అతని అనుచరుల చేతిలో చిత్రహింసలకు గురైన రేణుకా స్వామి షాక్‌కు గురై మెదడులో రక్తనాళాలు చిట్లి మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. దర్శన్, అతని అనుచరులు పెట్టిన చిత్రహింసలకు మరణించిన రేణుకా స్వామి శరీరంపై 15 గాయాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దర్శన్ దుగూదీప స్నేహితురాలైన నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకా స్వామిని దర్శన్, అతని అనుచరులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రేణుకా స్వామి శరీరంపైన గాయాలు, తల, పొట్ట, ఛాతీ, ఇతర భాగాలలో దెబ్బలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. చిత్రదుర్గ నుంచి బెంగళూరులోని ఒక షెడ్డుకు తీసుకువచ్చిన రేణుకా స్వామిని అక్కడి నిలిపి ఉన్న ఒక మినీ ట్రక్కుకు అతని తలను మోదినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేణుకా స్వామిని హింసించేందుకు ఉపయోగించిన దుంగలు, ఒక లెదర్ బెల్టు, ఒక తాడును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుణుకా స్వామి హత్యను తమ మీద వేసుకునేందుకు ముగ్గురు వ్యక్తులతో దర్శన్ కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్యపై గురువారం కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ ఇది అత్యంత క్రూమైన నేరమని అన్నారు. ఇందుకు దర్శన్ పర్యవసానాలు అనుభవించక తప్పదని ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా..చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రేణుకా స్వామిని తీసుకువచ్చిన రవి అనే కారు డ్రైవర్ శుక్రవారం పోలీసులకు లొంగిపోయాడు. చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రవి ట్యాక్సీని రఘు అలియాస్ రాఘవేంద్ర ఏర్పాటు చేశాడు. బెంగళూరులో వారిని దింపిన తర్వాత రవి అదృశ్యమయ్యాడు.

అయితే చిత్రదుర్గలోని ట్యాక్సీ అసోసియేషన్‌ను రవి సంప్రదించి జరిగిన విషయం చెప్పాడని, వెంటనే లొంగిపోవాలని వారు చెప్పడంతో రవి లొంగిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. కన్నడ నటుడు దర్శన అభిమాన సంఘాన్ని చిత్రదుర్గలో రఘు నడుపుతున్నాడు. రేణుకా స్వామి ఆచూకీ కోసం రఘును దర్శన్ సంప్రదించినట్లు పోలీసులు చెప్పారు. తమ ఇంటి సమీపం నుంచి తన భర్తను కిడ్నాప్ చేశారని రేణుకా స్వామి భార్య ఆరోపించారు. రోడ్డు పక్కన రేణుకా స్వామి మృతదేహాన్ని దర్శన్, ఆయన అనుచరులు పారేసి వెళ్లిపోయారు. మృతదేహాన్ని చేసిన ఒక ఫుడ్ డెలివరీ రైడర్ పోలీసులకు సమాచారం అందచేశాడు. మృతదేహాన్ని పారేసి అక్కడ నుంచి వెళ్లిపోతున్న రెండు కార్లు సిసిటివి ఫుటేజ్‌లో కనిపించాయి. అందులో ఒక కారు దర్శన్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News