46 ఏళ్ల పాటు మూతపడి క్రితం వారం తిరిగి తెరచుకున్న సంభల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలో భస్మ శంకర్ ఆలయంలో హనుమంతునికి పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో మంగళవారం వచ్చారు. హనుమంతునికి అర్చనలకు మంగళవారం ప్రత్యేక రోజు. ‘ఆలయాన్ని ఉదయం సుమారు 4 గంటలకు శుభ్రం చేశారు. హనుమంతునికి ప్రత్యేక వస్త్రం సమర్పించారు. హనుమాన్ చాలీసా పఠించారు’ అని ఆలయం అర్చకుడు శశికాంత్ శుక్లా తెలియజేశారు. ఆలయం గర్భగుడిలో శివునికి అలంకారం కూడా చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీ కార్తిక్ మహాదేవ్ ఆలయం (భస్మ శంకర్ ఆలయం)ను ఈ నెల 13న తిరిగి తెరిచారు.
అంతకు ముందు అక్రమ ఆక్రమణల నిరోధక కార్యక్రమం జరుపుతున్నప్పుడు తమ దృష్టికి మట్టి కింద నిక్షిప్తమైన ఆ కట్టడం కనిపించిందని అధికారులు తెలియజేశారు. ఆలయంలో హనుమంతును విగ్రహం. శివలింగం ఉన్నాయి. ఆలయాన్ని 1978లో మూసివేశారు. ఆలయం సమీపంలో ఒక బావి కూడా ఉన్నది. వివిధ ప్రదేశాల నుంచి భక్తులు ఆలయానికి రాసాగినట్లు శుక్లా తెలిపారు. ఆలయాన్ని తిరిగి తెరిపించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, జిల్లా మేజిస్ట్రేట్‌కు, ఎస్‌పికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.