Sunday, December 22, 2024

ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ సమ్మతమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రదురాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రదు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.‘ జమ్మూ, కశ్మీర్‌పై ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరు. భారత్‌లో విలీనం తర్వాత జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు.అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్టా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక ఏర్పాటే తప్ప శాశ్వతం కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు.

దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది కూడా సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే’నని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని జడ్జీలు మూడు వేర్వేరు తీర్పులను వెలువరించినప్పటికీ అందరూ కూడా రద్దు సక్రమమేనని పేర్కొనడం విశేషం. కాగా జస్టిస్ చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌నుంచి లడఖ్‌ను విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది.అయితే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్ర హోదాను వీలయినంతత్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాలి
ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం మొత్తం మూడు తీర్పులు వెలువరించింది. సిజెఐ చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు కలిసి ఒక తీర్పును వెలువరించగా , జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు వేర్వేరు తీర్పులు వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఖన్నా తన తీర్పును వెలువరిస్తూ జమ్మూ కశ్మీర్‌లో చోటు చేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలన్నారు. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.1980నుంచి జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై ఈ కమిటీ దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. అయితే ఆయన సిజెఐ, జస్టిస్ కౌల్ తీర్పులతో ఏకీభవించారు.

పండిట్ల వలసలు స్వచ్ఛందం కాదు
కాగా, జమ్మూ కశ్మీర్‌నుంచి కశ్మీరీ పండిట్ల వలసలు స్వచ్ఛందంగా జరిగినవి కాదని జస్టిస్ కౌల్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. 1980లో రాష్ట్రంలో జరిగిన హింసాకాండే కశ్మీరీ పండిట్ల వలసలకు కారణమని ఆయన అన్నారు. 1947నుంచి కూడా కశ్మీర్ లోయ ఎన్నో దురాక్రమణలకు గురయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోకి సైన్యం రాకను ప్రస్తావిస్తూ సైన్యం పని శాంతి భద్రతలను కాపాడడం కాదని, అయితే ఇది ప్రత్యేకమైన పరిస్థితి అని, దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికే ముప్పుగా పరిణమించడం వల్లనే సైన్యాన్ని దించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో కశ్మీర్ అధికార యంత్రాంగం కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News