ఇప్పటికే కేంద్రజలశక్తి శాఖకు చేరిన నేషనల్
డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్:కాళేశ్వ రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ తో పాటు మరో రెండు బ్యారేజీల నిర్మా ణ లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఏ) నివేదిక త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సమగ్ర నివేదికను జలశక్తి మంత్రిత్వశాఖకు అందజేశారు. జలశక్తి మంత్రిత్వశాఖ పరిశీలన తదుపరి ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నది. మేడిగడ్డ బ్యారేజీపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ జ్యుడీషియల్ కాళేశ్వరం కమిషన్ ఇ చ్చిన ఆదేశాలకు లోబడి ఎన్‌డిఎస్‌ఏ మధ్యంతర నివేదికను అం దజేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అందిన పూర్తి రిపో ర్టు ప్రతులు రాష్ట్ర ప్రభుత్వానికి, కాలేశ్వరం కమిషన్‌కు అందజేసే అవకాశాలు ఉన్నాయి.
కృష్ణా జలాల్లో అన్యాయం జరగనివ్వం : ఉత్తమ్
కృష్ణా నదీ జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మం త్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చిత్తశుద్దితో కట్టుబడి ఉందని ఆయనపునరుద్ఘాటించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ (డబ్లూపి1230/2023) గురువారం సుప్రీం కోర్టు లో విచారణకు వచ్చింది. ఈ నేపధ్యంలో మంత్రి ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ వాదులతో కలిసి విచారణకు స్వయంగా హాజరయ్యారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కోర్టు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసిందని, ఈ నెల 25వ తేదీ కల్లా అన్ని వాదనలపై షార్ట్ నోట్స్ సమర్పించాలన్నారని అన్నారు. కావున ఈ నెల 19 నుంచి -21వ తేదీ వరకు జరగాల్సిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ యధాతధంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. గురువారం సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వం వాదనలకు మద్దతుగా నిలిచిందని, ఇది రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగు అని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సుప్రీంకోర్టు విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, న్యాయవాదులు వైద్యనాథన్, గోపాల్ శంకర్ నారాయణ, అంతర్రాష్ట్ర నీటి వనరుల విభాగం అధికారులు హాజరయ్యారు.