Thursday, January 23, 2025

సముద్ర సాలీడుల్లో అవయవాల పునరుత్పత్తి

- Advertisement -
- Advertisement -

పునరుత్పత్తి అన్నది సూపర్ పవర్. అది సైన్స్‌ఫిక్షన్‌కు, సూపర్ హీరో మూవీలకే పరిమితం కాదు. జెర్రి వంటి శతపాదుల ప్రాణులు పోయిన కాళ్లను తిరిగి పుట్టించుకోగా, బల్లులు, తొండలు వంటి పాకే ప్రాణులు పోయిన తమ తోకలను తిరిగి పుట్టించుకోగలుగుతాయి. కోల్పోయిన అవయవాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తిని వాటికి సహజంగా ప్రకృతి ప్రసాదించింది. కానీ ఇప్పుడు ఎనిమిది కాళ్ల (అష్టపది) సముద్ర సాలీడు శక్తి సామర్ధాలను శాస్త్రవేత్తలు గమనించి ఆశ్చర్యపోతున్నారు.

ఇవి శాస్త్రీయంగా ఆర్థోపోడా వర్గానికి చెందిన పురుగులు. . ఆర్థ్థ్రోపోడాలు కీళ్లు గల పాదాలు, బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్కెరైట్, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. రొయ్యలు, కీటకాలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్లు, సాలెపురుగులు మొదలైనవి ఆర్త్థ్రోపోడా వర్గంలో ఉంటాయి. ఇప్పుడు సముద్ర సాలీడులు ఈ వర్గానివే. ఈ సముద్ర సాలీడులోని సూపర్ పవర్ చాలా ప్రత్యేకం. ఇవి కోల్పోయిన అవయవాలనే కాదు, మొత్తం శరీరం లోని భాగాలన్నిటినీ తిరిగి ఉత్పత్తి చేసుకోగలవు.

ఎవరూ కూడా ఇది ఊహించకపోయినా తాము మాత్రం మొదటిసారి కనుగొన్నామని బెర్లిన్ లోని హంబోల్డ్‌ట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గెర్హార్డ్ స్కాల్జ్ వెల్లడించారు. గెర్హార్డ్ నేతృత్వం లోని పరిశోధక బృందం వీటిపై సమగ్ర అధ్యయనం చేపట్టింది. 23 అపరిపక్వ, కాస్త పెద్ద సముద్ర సాలెపురుగుల వెనుకనున్న వేర్వేరు అవయవాలను, భాగాలను కత్తిరించింది.

తరువాత వీటిలో వచ్చిన మార్పులను గమనించింది. చిన్న సాలెపురుగులు తాము కోల్పోయిన శరీర భాగాలను అంటే పెద్దపేగు, మలద్వారం, కండరాలు, జననేంద్రియాలను పూర్తిగా తిరిగి ఉత్పత్తి చేసుకోగలిగాయి. పెద్ద సాలెపురుగుల్లో మాత్రం అవయవాల పునరుత్పత్తి కనిపించలేదు. అయితే వీటిలో కొన్ని చెప్పుకోదగిన స్థితిస్థాపకతను ప్రదర్శించి, తరువాతి రెండేళ్ల వరకు అలాగే బతుకును కొనసాగించాయి. మొత్తం మీద సముద్ర సాలెపురుగుల్లో 90 శాతం సుదీర్ఘకాలం బతికేవే. వీటిలో 14 యువ సాలెపురుగుల్లో వెనుకభాగాలు పునరుత్పత్తి కావడం కనిపించింది.

అలాగే మరో 16 యువ సాలెపురుగులు తమ బాహ్య అస్థిపంజరాన్ని కనీసం ఒకసారైనా తొలగించుకోవడం కనిపించింది. సముద్ర సాలెపురుగుల్లోని సూపర్ పవర్ ఏమిటో పరిశోధించడమైందని, అయితే ఈ పునరుత్పత్తి ప్రక్రియ ఎలా అవి చేయగలుగుతున్నాయో ఇంకా పరిశోధించ వలసి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కణపరంగా, అణుపరంగా తాము కనుగొనడానికి ప్రయత్నిస్తామని పరిశోధకులు చెప్పారు.

బహుశా ఎలాంటి బేధం లేని మూలకణాల వల్లనే వాటికి తిరిగి కొత్తగా అవయవాలు తయారౌతున్నాయని తెలుస్తోందన్నారు. మనుషుల్లో కోల్పోయిన అవయవాలు లేదా వేళ్లు తిరిగి ఉత్పత్తి అయ్యేలా వైద్య చికిత్స వ్యవస్థను కనుగొనడానికి ఆర్ధ్రోపాడ్స్ లోని పునరుత్పత్తి వ్యవస్థ తమకు మార్గదర్శకం అవుతుందన్న ఆశను పరిశోధకులు వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News