హైదరాబాద్ : ఈసారి గగనతలంలో విన్యాసాలకు దిగిన విమానాలు భీమ్ వజ్రంగ్, తిరంగ, గరుడ, అమృత్, త్రిశూల్ ఆకృతులలో కన్పించాయి. ఈ విమాన విన్యాసాలలో మిగ్ 29, స్యూ 30ఎంకెఐ, రాఫెల్ ఫైటర్స్ , సి 130 సూపర్ హెర్కులస్, సి17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బహుళా తొలిసారిగా చివరిసారిగా నేవీకి చెందిన ఐఎల్ 38 కూడా పాల్గొంది. భారతీయ నౌకాదళంలో ఈ యుద్ధ విమానం దాదాపుగా 42 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరికి దీనిని సేవల నుంచి విరమింపచేస్తారు.
దేశంలో స్వయంగా నిర్మించిన సైనిక పరికరాలను ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన యుద్ధ ట్యాంక్ అయిన అర్జున్, నాగ్ మిస్సైల్ సిస్టమ్ (నామిస్), కె 9 వజ్రలను కూడా ప్రదర్శించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇప్పుడు పాల్గొన్న అన్ని సైనిక పరికరాలు భారత్ నిర్మితాలని ఢిల్లీ ప్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ భవ్‌నీష్ కుమార్ తెలిపారు. నారీశక్తి ఇతివృత్తంతో ప్రదర్శనకు దింపిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థకు లెఫ్టినెంట్ చేతన శర్మ సారథ్యం వహించారు. డోగ్రా రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మరాఠా పదతిదళం, బీహార్ రెజిమెంట్, గూర్ఖా బ్రిగేడ్ కవాతులో సాగగా సరిహద్దు భద్రతా దళాలు (బిఎస్‌ఎఫ్)కు ప్రత్యేకమైన ఒంటె బృందం కూడా పాల్గొని కాల్బల సైనిక శక్తిని చాటింది.