న్యూఢిల్లీ: వరసగా రెండో ఏడాది గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. మహమ్మారి ఉధృతి దృష్టా ఈ ఏడాది కూడా నిరాడంబరంగానే వేడుకలను జరుపుకోవలసి వస్తోంది. అయితే ఈ ఏడాది వేడుకల్లో భారీ మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వాతావరణ పరిస్థితుల దృష్టా రిపబ్లిక్ డే పరేడ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతుందని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే పొగమంచు కారణంగా ఈ సారి ఉదయం 10.30 గంటలకు పరేడ్‌ను మొదలు పెట్టాలని రక్షణ శాఖ నిర్ణయించింది.
‘జనవరి 26న ఢిల్లీలో మంచు దుప్పటి పరుచుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అందువల్ల ప్రేక్షకులు పరేడ్‌ను వీక్షించేందుకు వీలుగా అరగంట ఆలస్యంగా పరేడ్‌ను ప్రారంభించాలని నిర్ణయించాం. అంతేకాకుండా రాజ్‌పథ్‌మార్గంలో ఇరువైపులా ఐదు ఎల్‌ఇడి స్క్రీన్ల చొప్పున పది ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. పరేడ్ ప్రారంభానికి ముందు గణతంత్ర దినోత్సవాలకు సంబంధించిన వీడియోలు, సాయుధ బలగాలపై తీసిన షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర స్ఫూర్తిదాయక వీడియోలను ఈ ఎల్‌ఇడి స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత పరేడ్ ప్రారంభం కాగానే్ర పత్యక్ష ప్రసారం చేయనున్నారు.
75 విమానాలతో విన్యాసాలు
ఈ ఏడాది దేశానికి స్వాతంత్య్రం వచ్చి75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గణతంత్ర వేడుకల్లో 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు ప్రదర్శించనుంది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్,ఎంఐ17,సారంగ్, అపాచీ, డకోటా వంటి విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. గగనతలంలో 15 ఆకృతులను ప్రదర్శించనున్నట్లు వాయుసేన అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది కూడా ఈ దేశాధినేతలు కూడా ముఖ్య అతిథులుగా రావడం లేదని సమాచారం.