న్యూఢిల్లీ : పాకిస్థాన్ జైళ్లలో శిక్ష పూర్తి అయిన 184 మంది భారతీయ మత్సకార్మికులను తక్షణం విడుదల చేసి, స్వదేశానికి పంపాలని భారత్ సోమవారం పాకిస్థాన్‌ను అభ్యర్థించింది. దీంతోపాటు భారతీయులుగా భావింపబడుతున్న 12 మంది పౌర ఖైదీలతో తక్షణం దౌత్యపరమైన అనుసంధానం కల్పించాలని భారత్ కోరినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉభయ దేశాల ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకునే ఆనవాయితీ ప్రక్రియ నేపథ్యంలో భారత్ ఈమేరకు పాక్‌ను అభ్యర్థించింది.
2008లో కుదిరిన ఒప్పందం మేరకు ప్రతిఏటా జనవరి1, జులై1 న ఈ జాబితాల మార్పిడి జరుపుతుండడం ఆనవాయితీగా వస్తోంది. భారత్ తన కస్టడీలో ఉన్న 337 మంది పౌర ఖైదీలు, 81 మంది మత్సకార్మికుల జాబితాను పాక్‌కు అందజేయగా, పాకిస్థాన్ 47 మంది పౌర ఖైదీలు, 181 మంది మత్సకార్మికుల జాబితాను భారత్‌కు అందజేసింది. ఈ సందర్భంగా పాక్‌లో జైలుశిక్ష పూర్తి చేసుకున్న 184 మంది భారతీయ మత్స కార్మికులను విడిచిపెట్టాలని భారత్ కోరింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా 2014 నుంచి 2639మంది భారతీయ మత్సకార్మికులు, 67 మంది భారత పౌర ఖైదీలు పాకిస్థాన్ నుంచి విడుదలయ్యారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వివరించింది.