10 శాతం రిజర్వేషన్‌పై స్పందించని ప్రజాప్రతినిధులు అందరూ జాతి ద్రోహులే
సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి పోరిక రాహుల్ నాయక్ ధ్వజం
మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచిన ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో విద్యా, ఉద్యోగ ఉపాధి రంగాలలో గిరిజనులు నష్టపోయారని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి పోరిక రాహుల్ నాయక్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని ములుగు జిల్లా కలెక్టర్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన జనాభా పదిశాతం పెరిగిందని, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అన్ని శాఖలలో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని లేని పక్షంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైన ప్రజా ప్రతినిధులు స్పందించి గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు.