కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలో పందులతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ,అధికారులు చొరవ తీసుకొని పందుల నిర్మూలన కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ పరిధిలోని భరత్ నగర్ కాలనీకి చెందిన పలువురు గ్రామస్తులు సోమవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కారేపల్లి ఎంపీడీవో ఎం.చంద్రశేఖర్, తహసిల్దార్ తూమటి శ్రీనివాస్, ఎస్సై పి. రామారావు లకు వినతి పత్రాలు అందజేశారు.
గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పందులను పెంచుతున్నాడు. అయితే ఈ పందుల వల్ల సమీపంలోని ముత్యాలమ్మ గుడి, వెంకటేశ్వర స్వామి ఆలయం ,అంగన్వాడీ కేంద్రం తో పాటు ప్రాథమిక పాఠశాలకు వచ్చే పిల్లలకు పెద్దలకు అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తూ ఈ వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు తలారి దేవ ప్రకాష్, పి యుగంధర్, సోమందుల నాగరాజు, సిహెచ్ నాగేశ్వరరావు, ఎం. నరసయ్య, వి. సంపత్ తదితరులు పాల్గొన్నారు.