Friday, November 15, 2024

తపోవన్‌లో ఆగిన సహాయక చర్యలు

- Advertisement -
- Advertisement -

Rescue operations halted at Tapovan tunnel

పెరిగిన రిషిగంగ నది నీటిమట్టం

తపోవన్(ఉత్తరాఖండ్): చమోలీ జిల్లాలోని రిషిగంగ నది నీటి మట్టం గురువారం పెరగడంతో నాలుగు రోజుల క్రితం వచ్చిన వరదల తర్వాత తపోవన్ జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయిన వారిని వెలికితీయడానికి జరుగుతున్న సహాయక చర్యలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. గత ఆదివారం హఠాత్తుగా వచ్చిన వరదలకు తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు సొరంగం బురద, శిథిలాలతో కూరుకుపోయింది. ఈ వరదల్లో 35 మంది మరణించగా దాదాపు 170 మంది గల్లంతయ్యారు. సొరంగంలో నిండిపోయిన బురదను తొలగించడానికి వివిధ సంస్థలకు చెందిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నిలిచిపోయిన సహాయక చర్యలు మళ్లీ ప్రారంభమయ్యాయని, భారీ యంత్రంతో తక్కువ సంఖ్యలో సహాయక బృందాను సొరంగం వద్దకు పంపామని అధికారులు తెలిపారు.

నది నీటి మట్టం పెరగడానికి కొద్ది గంటల ముందు సొరంగం ముఖ ద్వారం వద్ద పేరుకుపోయిన శిథిలాలను డ్రిల్లింగ్ చేస్తూ లోపల చిక్కుకుపోయిన కార్మికుల వద్దకు చేరుకోవాలని సహాయక సిబ్బంది భావించారు. కాగా, నీటి మట్టం పెరగడంతో భారీ యంత్రాలతో సహా వారంతా సొరంగం నుంచి వెలుపలకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ స్వాతి ఎస్ భదౌరియా తెలిపారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన సొరంగాలు ఉండగా అందులో 1.5 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడంపైనే సహాయక బృందాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. తెల్లవారుజామున 2 గంటలకు సొరంగంలో 12-13 మీటర్ల మేర పేరుకుపోయిన బురదను డ్రిల్లింగ్ ద్వారా తొలగించుకునే కార్యక్రమాన్ని సహాయక బృందాలు ప్రారంభించాయని ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే తెలిపారు. భారీ యంత్రం సాయంతో ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగిందని, సహాయకులకు, లోపల చిక్కుకున్న వారికి మధ్య భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాలు అవరోధంగా మారాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News