Monday, December 23, 2024

ఆపదలో ఉన్న వన్యప్రాణులను కాపాడేందుకు ప్రత్యేక రక్షణ వాహనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆపదలో ఉన్న వన్య ప్రాణులు, పక్షులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ సరికొత్త రక్షణ వాహనాన్ని (రెస్క్యూ వెహికిల్) అందుబాటులోకి తెచ్చింది. సిఎస్‌ఆర్ సామాజిక బాధ్యతలో భాగంగా సెక్రటేరియట్ కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ శాఖ సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ వాహనాన్ని సమకూర్చింది. అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులు, అటవీ శాఖకు ఈ వాహనాన్ని అందించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు, చుట్టు పక్కల జిల్లాల్లో వన్య ప్రాణులు మానవ ఆవాసాల్లోకి వచ్చినపుడు, ప్రమాదాల బారిన పడిన నెమళ్లు, ఇతర పక్షులు చిక్కుకుపోయిన సందర్బాలతో వాటిని రక్షించేందుకు ఈ వాహనం పనిచేస్తుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్ తెలిపారు.

జంతువుల వేట, స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించేందుకు కూడా ఈ వాహనంతో కూడిన యాంటీ పోచింగ్ టీమ్ సత్వరంగా స్పందిస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యేక వాహనంతో, సుశిక్షితులైన సిబ్బంది, ఆధునిక యంత్ర సామాగ్రి రెస్క్యూ టీమ్ లో అందుబాటులో ఉంటారని అన్నారు. అరణ్య భవన్ టోల్ ఫ్రీ నెంబర్ 18004255364 కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే, రెస్క్యూ టీమ్ వెంటనే స్పందిస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అధికారులు చీఫ్ జనరల్ మేనేజర్ కే. భాస్కర రావు, డీజీఎం కే. శ్రీధర్ బాబు, చీఫ్ జనరల్ మేనేజర్ కె. భాస్కర రావు, వీ. విజయ్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక అధికారి (వైల్ లైఫ్) శంకరణ్, డీసీఎఫ్ సంహిత, యాంటీ పోచింగ్ రేంజ్ ఆఫీసర్ రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News