సొరంగం వద్ద నిలిచిపోయిన రెస్క్యూ పనులు
శిధిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్ మిషిన్ బ్లేడ్లు
నేటినుంచి మానువల్ డ్రిల్లింగ్ మొదలు
మరింత ఆలస్యం కానున్న కార్మికుల వెలికితీత ప్రక్రియ
కార్మికుల క్షేమమే తమకు ముఖ్యమని ఎన్‌డిఎంఎ ప్రకటన
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు మరింత ఆలస్యం కానున్నాయి. ఇక్కడ డ్రిల్లింగ్ చేపట్టిన ఆగర్ మిషిన్‌కు పదేపదే అవాంతరాలు ఎదురవుతున్నాయి. శుక్రవారం సైతం మిషిన్‌కు శిథిలాలలోని ఇనుప పట్టీ అడ్డుపడింది. దీంతో ఆగర్ మిషిన్ బ్లేడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రస్తుతం అది పనికి రాకుండా పోవడంతో ప్రత్యామ్నాయ మార్గంలో మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఆదివారం నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం కానున్నట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ(ఎన్‌డిఎంఎ) సభ్యుడు లెఫ్టెనెంట్ జనరల్ సయ్యద్ అతా హుస్సేన్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. మాన్యువల్ డ్రిల్లింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందని ఆయన చెప్తూ, అయితే సొరంగంలో కార్మికులు చిక్కుపడి ఉన్నందున వారికి ఎలాంటి హానీ జరగకుండా అత్యంత జాగ్రత్తగా దీన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. టన్నెల్ లో గట్టిగా ఉండే భాగాన్ని చేరుకోవాలంటే సొరంగం పైభాగంనుంచి నిలువుగా 86 మీటర్లు డ్రిల్లింగ్ జరపాల్సి ఉంటుందని, దీనికి కొంత ఎక్కువ సమయం పడుతుందని ఆయన చెప్పారు. అంటే దాదాపు మరో నెలరోజుల పాటు కార్మికులు సొరంగంలోనే ఉండాల్సి వస్తుంది.
ఆగర్ మిషిన్ బ్లేడ్లు సొరంగం శిథిలాలలో చిక్కుపడిపోయాయని, వాటిని బైటికి తీసేందుకు హైదరాబాద్‌నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తెప్పిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి చెప్పారు. ఈ రాత్రికి అది డెహ్రాడూన్ చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. సొరంగంలోగర్ మిషిన్ సాయంతో ఇప్పటివరకు 48.6 మీటర్ల మేర డ్రిల్లింగ్ జరపగా, 46.8 మీటర్ల వరకు కార్మికులను బయటకు తీసుకురావడానికి ఉద్దేశించిన 800 ఎం.ఎం వ్యాసం గలిగిన స్టీల్ పైప్‌ల ఏర్పాటు పూర్తయింది. ఈ పైపుల ద్వారా టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులకు ఆహారాన్ని పంపిస్తున్నారు. శనివారం ధామి ఈ పైపుగుండా సొరంగంలోకి వెళ్లి టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడారు కూడా.
పెరిగిపోతున్న ఆందోళన
ఇదిలా ఉండగా కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయి 13 రోజులు దాటి పోయినా వారిని ఇప్పటికీ బైటికి తీసుకు రాకపోవడంతో లోపల ఉన్న కార్మికులతో పాటుగా బయట ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువుల్లోను ఆదుర్దా పెరిగిపోతోంది. తాము ఎప్పుడు బైటికి వస్తామని లోపల చిక్కుకు పోయిన కార్మికులు తమను అడుగుతున్నారని వారితో మాట్లాడినవారి బంధువులు అంటున్నారు. లోపల ఉన్న కార్మికుల్లో ఒకరయిన వీరేంద్రతో శనివారం మాట్లాడిన అతని వదినె సునీత తన మరిది చాలా ఆందోళనతో ఉన్నట్లు తెలిపింది.
‘ఈ రోజు పది నిమిషాల పాటు నేను అతనితో మాట్లాడాను. ఈ రోజు ఉదయం అతను ఏమీ తినలేదు. తనకు తినాలనిపించడం లేదని అతను చెప్పాడు. అతను చాలా అలిసిపోయినట్లు కనిపించాడు. మేము ఎప్పుడు బయటికి వస్తామని అతను పదేపదే అడుగుతూ ఉన్నాడు’ అని సునీత చెప్పింది. బీహార్‌కు చెందిన సునీత తన భర్త, వీరేంద్ర భార్యతో కలిసి ఘటనా స్థలికి కొద్ది రోజుల క్రితం వచ్చింది. త్వరలోనే కార్మికులను బయటికి తీసుకు వస్తామని అధికారులు గత రెండు రోజులుగా చెబుతూనే ఉన్నారని, అయితే అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఆలస్యం అవుతూనే ఉందని వీరేంద్ర సోదరుడు దేవేందర్ అన్నాడు. అతని మాటల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న మరికొందరిలో మాటల్లో కూడా దాదాపు ఇదే ధ్వని వినిపిస్తోంది.