సెంట్రల్ జోన్ విసిల సదస్సులో ఓయూ విసి ప్రొఫెసర్ రవీందర్
మన తెలంగాణ/ హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పరిశోధనలు విస్తృతంగా జరగాల్సిన ఆవశ్యకత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ పేర్కొన్నారు. పరిశోధనల్లో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. గురువారం ఛత్తీస్ గఢ్ బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ సదస్సుకు హాజరైన ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి కీలక అంశాలను ప్రస్తావించారు.
ఓయూలో ప్రవేశపెట్టిన ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల గురించి వివరిస్తూ విదేశీ విశ్వవిద్యాలయాలతో ఓయూ చేసుకున్న పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రస్తావించారు. ఈ భాగస్వామ్య ఒప్పందల ద్వారా విశ్వవిద్యాలయాలు మేధో వనరుల్ని పంచుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఓయూలో ఏర్పాటు చేసిన టిబిఐ సెంటర్ లో నిర్వహిస్తున్న పరిశోధల్ని సదస్సులో ప్రజెంట్ చేశారు. ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా చేపడుతున్న పరిశోధనల పురోగతిని వివరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న విధానాలు చేపట్టనున్నట్టు తెలిపారు.