ప్రతి రోజు ఏదో ఒక వివాదం ముందుకొస్తున్నది. ఇది ఎలా మనం అనుమతించాలి. దీనినే ఒక ప్రధాన సమస్యగా చర్చించాల్సి వస్తున్నది. ఇది కొనసాగడానికి వీలు లేదు. భారత దేశం సమైక్యతతో ఉందనే విషయాన్ని మనం ప్రపంచం ముందు రుజువుచేయాలి’ అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఒక సూచన చేశారు. కొన్ని రోజుల క్రితం పుణెలో “సమ్మిళిత సమాజం” అనే అంశంపై ప్రసంగిస్తూ మసీదులను సర్వే చేయాలని, అందులో లేదా వాటి కింద దేవాలయాలున్నాయని న్యాయస్థానాల ముందుకు వెళుతున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని, ప్రస్తుతం మన దేశం రాజ్యాంగాన్ని అనుసరించి పాలన సాగిస్తున్నదని, ఆధిపత్య విధానాలు కొనసాగించాలనే విధానానికి ఇకనైనా స్వస్తి పలకాలని ఆయన కోరారు.
ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుని, దాని నాయకత్వంలో పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతలు మసీదు, దేవాలయాల వివాదాన్ని చాలా పెద్ద సమస్యగా చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎన్నో ఆందోళనలను రేకెత్తించాయి. అయితే మోహన్ భగవత్ వ్యాఖ్యలు వాటికి భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ అదే ఆర్‌ఎస్‌ఎస్ ఆధికారిక అభిప్రాయమే అయితే అంతకన్నా మంచి విషయం లేదు. దీనిని అందరూ స్వాగతించాల్సిందే. ఈ వ్యాఖ్యలను ఆ సంస్థ, దాని అనుబంధ సంఘాలు, పార్టీ ఆమోదించి అనుసరిస్తాయా లేదా అనేది వేచిచూడాల్సిందే. అయితే అటు మోహన్ భగవత్ మాటలు మరిచిపోక ముందే కొందరు హిందూ మత పెద్దలు తమ వ్యతిరేకతను, నిరసనను ప్రకటించారు.
అఖిల భారత సంత్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రనాథ్ సరస్వతి, జగద్గురు రామచంద్రాచార్యులు, మోహన్ భగవత్ వ్యాఖ్యలపైన విరుచుకుపడ్డారు. “మతపరమైన విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సింది మత పెద్దలే కాని ఆర్‌ఎస్‌ఎస్ కాదు. మత పెద్దలు, గురువులు తీసుకున్న నిర్ణయాలను ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంఘాలు, విశ్వహిందూ పరిషత్‌లు ఆమోదించాలి” అంటూ అఖిల భారత సంత్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రనాథ్ సరస్వతీ హుకుం జారీ చేశారు.
అంతేకాకుండా కొత్తగా 56 ప్రదేశాల్లో హిందూ దేవాలయాలు కొత్తగా బయటపడ్డాయి. మత సంస్థలు ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకోవాలి. రాజకీయ ఎజెండాలతో కాదు” అంటూ ఇంకా హిందూ దేవాలయాల సమస్యలపై తాము తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయనతోపాటు ప్రముఖ హిందూ మత పెద్ద జగద్గురు రామచంద్ర చార్య స్పందిస్తూ ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాలనుకుంటున్నాను. హిందూ మతానికి మేమే మార్గదర్శనం చేయాలి. మోహన్ భగవత్ కాదు.
ఇది సందర్భం. ఇది వివాదం. సంవాదం. అయితే మోహన్ భగవత్ మాటలను హిందూ మత పెద్దలు తిరస్కరించారు. పైగా తాము చెప్పిందే అంతిమమని, ఏదైనా తమ నిర్ణయాలే అమలు జరగాలని స్పష్టం చేశారు. అంటే దానర్థం భవిష్యత్‌లో కూడా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మసీదు, దేవాలయాల వివాదం రావడం ఖాయం. అయితే దీనికి ఆర్‌ఎస్‌ఎస్ సమాధానం ఎలా ఉంటుందనే దానిని బట్టి మోహన్ భగవత్ మాటలకు విలువ ఉంటుంది.
భారతదేశంలో కొనసాగుతున్న వివాదం ఇంతటితో ఆగదు. ఇది మరిన్ని వివాదాలకు దారితీసే ప్రమాదమున్నదనేది వాస్తవం. ఇక్కడ కేవలం హిందు ముస్లిం మతాలే లేవు. అతి ప్రాచీనమైన జైనం, బౌద్ధం మతాలు కూడా ఉన్నాయి. ఎన్నో బౌద్ధ, జైన వారసత్వ స్థలాలు అన్యమత ఆక్రమణలకు గురయ్యాయి. ముఖ్యంగా హిందూ, ముస్లిం మతాలు బౌద్ధం, జైనం విహారాలను, ఆలయాలను ఆక్రమించి తమ దేవుళ్ల ఆలయాలుగా మార్చివేసినట్టు చరిత్ర పరిశోధకులు ఆధారాలతో నిరూపించారు. ఒకవేళ మసీదు, దేవాలయాల సర్వే నిర్వహిస్తే బౌద్ధ వారసత్వ ప్రదేశాలలో కూడా దీనిని కొసాగించాలి. అక్కడ చారిత్రక ఆధారాలు, పురాతత్వ ఆధారాలు లభిస్తే ఆ స్థలాలను ఆయా మతాలకు అప్పగించాలి.
అయోధ్యలోని బాబరీ మసీదు అడుగు భాగంలో జరిపిన తవ్వకాలలో బయటపడిన అవశేషాలు బౌద్ధ మతానివే. ఈ విషయాలను పురాతత్వ పరిశోధన తేల్చివేసింది. అయితే దీనిని మభ్యపెట్టి, ఆ విషయాలను బయటకు రాకుండా చేశారు. చైనా బౌద్ధ యాత్రికులలైన ఫాహియాన్, హుయాన్ త్సాంగ్‌లు రికార్డు చేసిన తమ యాత్రా విశేషాల్లో అయోధ్య ఒకనాడు బౌద్ధ కేంద్రమని ఆధారాలతో సహా వెల్లడించారు. కాని అధికారంలో ఉన్న ప్రభుత్వం, హిందూ ఆధిపత్య భావజాలంతో ఉన్న ఇతర ప్రభుత్వ విభాగాలు దీనిని విస్మరించాయి.
అంతేకాకుండా, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధ్ గయలోని బోధి వృక్షాన్ని, దాని కింద ప్రతిష్టించిన బుద్ధుడి విగ్రహాన్ని క్రీ.శ. ఏడవ శతాబ్దం బెంగాల్ రాజు శశాంక తొలగించారు. ఈ విషయం మంజుశ్రీ మూలకల్ప గ్రంథంలో ప్రస్తావించారు. ఆ తర్వాత బోధ్ గయలోని ఆ ప్రాంతంలో శివాలయం స్థాపించారు. బోధ్ గయ బౌద్ధ విహారం, స్థూపంను బౌద్ధులకు అప్పగించాలని 1886లో మొదటి సారిగా అర్నాల్డ్ అనగారిక ధమ్మపాల ఉద్యమం చేశారు. కాని ఇప్పటికీ బోధ్ గయ పూర్తిగా బౌద్ధల ఆధీనంలోకి రాలేదు.
చరిత్ర పరిశోధకులు డి.ఎన్. జా రాసిన “ఎగ్నెస్ట్ ది గ్రెయిన్” అనే పుస్తకంలో పూరి జగన్నాథ్ దేవాలయంతో సహా చాలా దేవాలయాలు బౌద్ధం శిథిలాల మీద నిర్మాణమైనట్టు సందేహం వ్యక్తం చేశారు. అదే విధంగా గౌతమ బుద్ధుడు చేసిన మొదటి ప్రసంగం స్థలం సారనాథ్‌లో సామ్రాట్ అశోకుడు నిర్మించిన ధమ్మరాజక మందిరాన్ని 1794లో జగత్ సింగ్, చేత్ సింగ్‌లు ధ్వంసం చేసినట్టు చరిత్రకారులు రుజువు చేశారు. అదే విధంగా హిమాలయాల్లోని బద్రినాథ్ దేవాలయం బౌద్ధ క్షేత్రం స్థానంలో నిర్మాణమైనట్టు మహా మేధావి, గొప్ప చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ తన హిందీ పుస్తకం “హిమాలయ పరిచయ్” లో వివరించారు. ఇవి అతి ప్రధానమైన చరిత్ర సంపదలోని కొన్ని విధ్వంసాలు, కొన్ని ఆక్రమణలు. నలంద విశ్వవిద్యాలయాన్ని ముస్లిం రాజు భక్తియార్ ఖిల్జీ 1200 సంవత్సరంలో దహనం చేశారనేది కూడా చరిత్ర. బౌద్ధం మీద అటు హిందూ, ముస్లిం రాజులు దాడులు చేశారు. హిందువులు తమ దేవాలయాలను, ముస్లింలు తమ మసీదులను నిర్మించారు. అయోధ్య దానికి ఒక నిదర్శనం.
అదే విధంగా పుణెకు చెందిన యువ బౌద్ధ పరిశోధకుడు సాగర్ కాంబ్లే దేశ వ్యాప్తంగా దాదాపు 800కు పైగా బౌద్ధ ప్రాచీన వారసత్వ ప్రదేశాలను వీడియో, డాక్యుమెంటేషన్ చేశారు. ఇది ఒక అద్భుతమైన రికార్డు. ‘బోధిసత్వ’ అనే యూట్యూబ్ ఛానెల్ ఆయన ప్రసారం చేశారు. అయితే సాగర్ కాంబ్లే పరిశోధన ప్రకారం దాదాపు వందకు పైగా బౌద్ధ స్థలాలలో హిందూ దేవాలయాలు, ముస్లిం మసీదులు వెలిశాయి. ఇందులో 90 శాతం హిందూ దేవాలయాలు, పది శాతం ముస్లిం మసీదులు ఉన్నాయని సాగర్ కాంబ్లే వివరించారు.
మనమంతా అత్యంత ఆశ్చర్యానికి గురయ్యే విషయం మీముందుంచుతాను. ఇంతకు ముందు వివరించినవి, మన కళ్ళకు దూరంగా ఉన్న ప్రదేశాలు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ సజీవ సాక్షాలుగా నిలిచిన కొన్ని ప్రదేశాల వివరాలు మీముందుంచుతాను. తెలుగు ప్రజలు గర్వించే ఇద్దరు చరిత్ర పరిశోధకులు చేసిన పరిశోధనలో దాదాపు 18 బౌద్ధ ప్రదేశాలు హిందూ దేవాలయాలుగా మారిన మార్చిన కథ ఇది.
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం జగతిపాడు, దీనినే జగరిమెట్ట అంటారు. ఇక్కడ బయటపడిన బౌద్ధా రామం మీద శివాలయం నిర్మించారు. అనకాపల్లి మూడు కిలోమీటర్ల దూరంలోని శంకారం కూడా ఒకనాడు బౌద్ధ క్షేత్రం. ఆ తర్వాత కాలంలో అది హిందూ క్షేత్రంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని భట్టిప్రోలు బౌద్ధ క్షేత్రం ల.. లదిబ్బగా మార్చారు. దానిని పూర్తిగా అపభ్రంశం చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఒకనాటి బౌద్ధ క్షేత్రం. కృష్ణా ఒడ్డున ఉన్న ఉండవల్లి గుహలు కూడా బౌద్ధ సంపదలో భాగం. ఈ గుహలలో మహాపరి నిర్వాణ రూపంలో ఉన్న బుద్ధుని శిల్పానికి మార్పులు చేసి అనంతశయనుడిగా ఉండే విష్ణువుగా మార్చారు. ఆంధ్రలో పిలుచుకుంటున్న పంచారామాలు కూడా బౌద్ధా రామాలేనని కూడా ఆ ఇద్దరు చరిత్ర పరిశోధకులు తేల్చి చెప్పారు. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా చేజెర్ల గ్రామంలోని కపోతేశ్వర ఆలయం కూడా బౌద్ధ క్షేత్రమే.
అదే విధంగా తమిళనాడులోని నాగపట్నం ఒకప్పుడు బౌద్ధం విరాజిల్లిన ప్రదేశం. అయితే ఆ ఆనవాళ్లను లేకుండా చేసి వివిధ రూపాల్లో హిందూ దేవాలయాలు వెలిశాయి. అదే విధంగా తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయం అత్యంత ప్రసిద్ధమైనది. ఎవరైనా సరే ఆ దేవాలయంపైన పరీక్షగా చూస్తే పైన చిన్న చిన్న బుద్ధుని బొమ్మలు చెక్కి ఉన్నాయి. దీనినేమంటారు. ఇట్లా చెప్పుకుంటూపోతే ఎన్నైనా చెప్పవచ్చు. పాత ప్రార్థనా స్థలాల మీద వివాదాలు లేపి వాటి మీద హక్కు ప్రకటించుకునే ఏ మతం వారమైనా సరే అన్ని మతాల స్థలాలపైన పరిశోధనలు జరగాలని కోరుకోవాలి. అది ప్రజాస్వామిక విధానం. ఎవరికి బలముంటే వారిదే అధికారం, ఆధిపత్యం అంటే అది తాత్కాలికంగా నెగ్గుతుందే కాని అంతిమంగా ఓడిపోతుంది.
మోహన్ భగవత్ మాటలను నిజం చేసే ఆచరణను ఆర్‌ఎస్‌ఎస్ స్వీకరించాలి. దీనితోపాటు, హిందూమత పెద్దలు కూడా సంయమనం పాటించాలి. సామరస్య పూర్వకంగా, సమైక్యంగా జీవించాలనే ఆలోచన అందరికీ ఆదర్శం కావాలి. ఈ విషయమై కేవలం మత పెద్దల విచక్షణకు వదిలిపెట్టకుండా బాధ్యతాయుతమైన పౌరు లు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామిక వాదులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించాలి. అది ఒక మంచి, మానవత్వంతో కూడిన సమాజం ఏర్పడడానికి పునాది కావాలి.
మల్లేపల్లి లక్ష్మయ్య
దర్పణం