శనిగ్రహ వ్యవస్థలో భూమిని పోలిన టైటాన్ పై పరిశోధన
న్యూఢిల్లీ : భూమిని పోలిన మరోభూమి మన సౌరవ్యవస్థలో దాగి ఉందా ? అన్న ప్రశ్నకు శనిగ్రహ వ్యవస్థ (శాటర్ణియా ) లో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శనిగ్రహ వ్యవస్థలో శనిగ్రహం చుట్టూ 82 చంద్రులు ఉన్నాయి. ఇదొక విధంగా చిన్నపాటి సౌర వ్యవస్థ వంటిది. ఈ 82 చంద్రుల్లో అత్యంత ఆసక్తి కరమైన చంద్రగ్రహం టైటాన్. ఇది దాదాపు భూగోళంలా ఉంటుంది. కొత్తగా చేపట్టిన పరిశోధనల్లో ఈ టైటాన్ ఉపరితలంపై ఇసుక తిన్నెలు బయటపడ్డాయి. సీజన్లవారీగా వచ్చిన ఇసుక తుపాన్ల వల్లనే ఇవి ఏర్పడ్డాయని పరిశోధకులు వివరిస్తున్నారు. టైటాన్‌పై నదులు, సరస్సులు, సముద్రాలు, ఇవన్నీ దట్టమైన వాతావరణం నుంచి వచ్చే వానల వల్ల ఏర్పడ్డాయి. అయితే ఈ సరస్సులు భూమిపై ఉండే వాటికన్నా వివిధ రకాలైన ఖనిజాలు, ధాతువులతో నిండి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.ద్రవ రూపం లోని మెథేన్ ప్రవాహాలు టైటాన్ మంచుగడ్డల ఉపరితలాన్ని చీలుస్తున్నాయి. నత్రజని గాలులు హైడ్రోకార్బన్ ఇసుక తిన్నెలను ఏర్పరుస్తున్నాయి. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ జియోలజిస్టు మేథ్యూ లాపొట్రే మార్గదర్శకత్వం లోని పరిశోధకులు టైటాన్ నైసర్గిక భౌగోళిక స్వరూపాలను కనుగొన గలిగారు.