ఏడాది లోపు నవజాత శిశువుల ఆకస్మిక మరణాలకు గల కారణాలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు సాగించారు. ఈ ఆకస్మిక మరణాల సిండ్రోమ్ ( సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ ఎస్‌ఐడిఎస్) ఎలా సంభవిస్తుందో ఇటీవల కాలం వరకు అంతుపట్టలేదు. అయితే దీన్ని నివారించడానికి సహాయపడే జీవరసాయనం బుటిరిల్కోలినెస్టెరేస్ (బీసీహెచ్‌ఇ) ను గుర్తించ గలిగారు. భారత్‌లో ప్రతి వెయ్యి జననాల్లో 3.9 శాతం వంతున ఈ సిండ్రోమ్ కనిపిస్తున్నట్టు తేలగా, ఇతర దేశాల్లో మాత్రం ఏడాది లోపు శిశువుల్లో 50 శాతం వరకు ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని తేలింది.
ఈ అధ్యయనంలో వైద్య శాస్త్రవేత్తలు బీసీహెచ్‌ఇ చర్యను తెలుసుకున్నారు. కొత్తగా జన్మించిన నవజాత శిశువుల 722 రక్త నమూనాలను పరీక్షించారు. ఈ రక్త నమూనాలను డ్రైడ్ బ్లడ్‌స్పాట్స్ (డిబిఎస్) అని అంటారు. అకస్మాత్తుగా మరణించే శిశువుల్లోను, ఇతర వ్యాధుల కారణంగా చనిపోయే శిశువుల్లోను బీసీహెచ్‌ఇ జీవ రసాయనం ఏ స్థాయిలో ఉందో పోల్చి చూశారు. వీటిని సజీవంగా ఉన్న 10 మంది శిశువుల రక్త నమూనాలతో పోల్చి చూశారు. ఏ పిల్లలైతే అకస్మాత్తుగా చనిపోయారో వారిలో బీసీహెచ్‌ఇ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
మెదడు స్పందించి ఉద్రేక సంకేతాలు పంపే మార్గంలో బీసీమెచ్‌ఇ ప్రధాన పాత్ర వహిస్తుందని, ఇది లోపిస్తే ఆకస్మిక మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. పిల్లల్లో ఇది లోపిస్తే వారు సరిగ్గా మేలుకోలేరు. అలాగే బాహ్య వాతావరణానికి స్పందించే గుణం లోపిస్తుంది. ఇప్పుడు నవజాత శిశువుల్లో బీసీహెచ్‌ఇ పరీక్షను తప్పనిసరిగా ప్రవేశ పెట్టి మరింత పరిశోధన చేయవలసి ఉందని సిడ్నీ పిల్లల ఆస్పత్రి వైద్య బృందం అభిప్రాయపడుతోంది.