హైదరాబాద్: సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే ఉద్దేశంతోనే ఎంతో మంది సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్నారని భారత సామాజిక శాస్త్రాల పరిశోధనా సంస్థ అదనపు సంచాలకులు డాక్టర్ రిచా శర్మ అభిప్రాయపడ్డారు. గురువారం పరిశోధనా ప్రతిపాదన రచన -అనుబంధ సమాచారం అనే అంశంపై ఓయూ ఆర్ట్ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలోఐసీఎస్‌ఎస్‌ఆర్ పనితీరు, లక్ష్యాలు, సాధించిన విషయాలను వివరించారు.
పరిశోధకులు ప్రాజెక్టులు, ఫెలోషిప్‌లు, ట్రావెల్ గ్రాంట్ లు సహా వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. తమిళనాడు, ఢిల్లీ నుంచి ఎక్కువగా పరిశోధనా ప్రతిపాదనలు వస్తున్నాయని వారికి సంపూర్ణ అవగాహన ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక అందుబాటులోకి రావటంతో పరిశోధకులకు అనేక టూల్స్ అందుబాటులోకి వచ్చాయని ఫలితంగా మరింత సమగ్రంగా, బహుళ అంశాలు, విధానాల్లో పరిశోధకులకు పట్టు ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అంశాల్లో పరిశోధనలు చేయటం ద్వారా లోతైన పరిశోధనలు సాధ్యమవుతాయని తెలిపారు.
సాంఘిక శాస్త్రాలలో పోటీపడటం కన్నా ఒకరికొకరు సహకరించుకోవాలని పరిశోధనా పనిలో నైతిక సమస్యలు, విద్యా సమగ్రతపై సూచనలు చేశారు. ప్రయోగాత్మక అధ్యయనం, ఆవశ్యకత, ప్రతిపాదన సమర్పణలో చేయవలసినవి, చేయకూడనివి, ప్రతిపాదనల మూల్యాంకన ప్రమాణాలు, గతం నుండి వచ్చిన మార్పులు, స్వల్పకాలిక అనుభావిక పరిశోధన ప్రాజెక్ట్‌లలో నిధుల పంపిణీ విశిష్టతను వివరించి పరిశోధకుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కె. స్టీవెన్సన్, బి. నారాయణ, ఐ.డైసీ, బి.లావణ్య, పి. స్వాతి, డాక్టర్ వి.సమున్నత, ప్యాట్రిక్, జి. అంజయ్య వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.