Thursday, February 20, 2025

స్థానిక పోరులో మారనున్న రిజర్వేషన్

- Advertisement -
- Advertisement -

కొత్త రిజర్వేషన్ ఏముంటుందో
అని ఆశావహుల్లో ఆసక్తి
ప్రజలతో మమేకమయ్యేందుకు
పంథాను మార్చుకుంటున్న అభ్యర్థులు

మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల రిజర్వేషన్లు మారనుండటంతో ఆశావహుల్లో సమీకరణాలు మారనున్నాయి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు గత ప్రభుత్వం రెండు దఫాలకు వర్తించేలా పంచాయతీరాజ్ చట్టం (2018) తీసుకొచ్చినా డిసెంబరులో నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు- 2024కు ఆమోదం లభించడంతో ఒకే దఫా మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. అయితే డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, త్వరలోనే ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని ఆశావహులు భావించారు. కానీ వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలకు పరిగణలోకి తీసుకుని రెండో విడత కులగణన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు కొంత కాలం పాటు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. న్యాయస్థానానికి ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. కులగుణనలో రెండోవిడతలో వివరాల సేకరణ, పరిశీలన, ఆ తర్వాత కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్‌కు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఆశావహుల్లో తర్జనభర్జన
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదివరకు ఉన్న రిజర్వేషన్ ఉండకపోవచ్చు. జెడ్‌పి చైర్మన్ నుంచి సర్పంచ్ స్థానాల వరకు రిజర్వేషన్లు మారనున్నాయి. రిజర్వేషన్ల కేటాయింపుల్లో తొలుత ఎస్‌టిలకు రిజర్వు స్థానాలు కేటాయిస్తారు. ఎస్‌టి తరువాత ఆ స్థానంలో రొటేషన్ పద్ధతిలో ఎస్‌సి,అనంతరం బిసికి రిజర్వు చేస్తారు. అయితే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ ఉండనున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ మారనుండటంతో పోటీకి ఆసక్తి ఉన్న అభ్యర్థులలో కొత్త రిజర్వేషన్ ఏముంటుందో అనే ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్‌పై స్పష్టత లేకపోవడంతో ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు. రిజర్వేషన్లు మారనుండటంతో చాలామంది ఆశావహులు ప్రజలతో మమేకమయ్యేందుకు తమ పంథాను మార్చుకుంటున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో ఆశావహులు ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇంకొందరు పార్టీ పరంగా బరిలోకి దిగేందుకు కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారు.

ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమైన పిఆర్, ఎస్‌ఇసి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్‌పిటిసి, 5,817 ఎంపిటిసి స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. అలాగే ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.

ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనర్ సృజన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేశారు. ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండేలా సన్నద్ధమై ఉండాలని కమిషనర్ సృజన సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News